గులాబీ పార్టీలో గ్రూపు తగదాలు.. కార్పొరేటర్ వర్సెస్ ఎమ్మెల్యే

by  |
గులాబీ పార్టీలో గ్రూపు తగదాలు.. కార్పొరేటర్ వర్సెస్ ఎమ్మెల్యే
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : గులాబీ పార్టీలో గ్రూపు తగదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల మధ్య అంతర్గతంగా వార్ నడుస్తోంది. గ్రేటర్ లోని పలువురు ఎమ్మెల్యేలు మమ్మల్ని అవమానాలకు గురిచేస్తున్నరంటూ స్థానిక కార్పొరేటర్లు అవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రొటోకాల్ పాటించడంలేదని, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు పిలవడంలేదంటూ సదరు ఎమ్మెల్యేలపై అగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గతంలో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పై కాచిగూడ కార్పొరేటర్ ఎక్కాల చైతన్య కన్నా అభివృద్ది పనులకు పిలవడంలేని ఆరోపించగా, తాజాగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, స్థానిక ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుబాష్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. తాను కార్పొరేటర్ గా గెలిచిన నాటి నుంచి ఎమ్మెల్యే తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని, తన ఓటమికి కారకులైన వారితో ఎమ్మెల్యే కుట్రలు చేస్తున్నారని కార్పొరేటర్ శ్రీదేవి ఆరోపించింది.

పీక్ స్టేజ్ లో ఉప్పల్ పాలిటిక్స్..

ఉప్పల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు పీక్ స్టేజీలో నడుస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ల మధ్యన కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. బొంతు రామ్మోహన్ ఉప్పల్ ఎమ్మెల్యే టికెట్ ను అశించారు. అయితే పార్టీ అధిష్టానం ఆ టికెట్ ను బేతి సుభాష్ రెడ్డికి ఇచ్చి గెలిపించుకుంది. ఈ తర్వాత చర్లపల్లి డివిజన్ నుంచి తన భార్యను పోటీ చేయించి, మహిళ రిజర్వేషన్ కోటాలో మేయర్ చేయాలన్నా మాజీ మేయర్ రామ్మోహన్ కల కూడా సాకారం కాలేదు.

దీంతో తనకు పోటీగా టికెట్ అడుగుతారా.. ? అని మనస్సులో పెట్టుకున్న ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మాజీ మేయర్ రామ్మోహన్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని భావించినట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చర్లపల్లి కార్పొరేటర్ గా గెలుపొందిన రామ్మోహన్ భార్య శ్రీదేవిపై కక్ష పెంచుకున్నాడని చెబుతున్నారు. చర్లపల్లి డివిజన్ లో ఎమ్మెల్యే పర్యటించినా… అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసినా.. ఏ ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు తనకు సమాచారం ఇవ్వడంలేదని కార్పొరేటర్ ఆరోపిస్తోంది.

bonthu sridevi

సఖ్యత లేకనే..

ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి గత మాజీ కార్పొరేటర్లకు కూడా సఖ్యత లేదు. నియోజకవర్గంలోని కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణ రాజుకు తప్ప మిగితా డివిజన్ల కార్పొరేటర్లకు టికెట్ రాకుండా అడ్డుకున్నారు. అయితే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి చర్లపల్లి డివిజన్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. జీహెచ్ఎంసీ మేయర్ రేసులో కూడా శ్రీదేవి పోటీ పడ్డారు. అయితే పార్టీ అధిష్టానం టీఆర్‌ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మికి అవకాశం కల్పించింది. అప్పటి నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సైతం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే చర్లపల్లి కార్పొరేటర్ శ్రీదేవి మినహా, మిగితా టీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరూ ఎమ్మెల్యే అనుచరులే.

వీరందరితో సఖ్యతగా ఉంటున్నప్పటికీ, బొంతు శ్రీదేవిని మాత్రం ముందు నుంచి దూరం పెడుతూ వస్తున్నారని ఆమె ఆరోపిస్తోంది. మాజీ మేయర్ రామ్మోహన్ తోపాటు శ్రీదేవిని కూడా రాజకీయంగా దెబ్బతియాలని, లేదంటే వారే భవిష్యత్తులో తనకు ప్రధాన పోటీ దారులవుతారని ఎమ్మెల్యే భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే శ్రీదేవికి చర్లపల్లిలో ఉనికి లేకుండా పలు కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా ఉప్పల్ లో ఇంతకాలం నివురు గప్పిన నిప్పులా ఉన్నా టీఆర్‌ఎస్ గ్రూపు తగదాలు శుక్రవారం ఒక్కసారి కార్పొరేటర్ శ్రీదేవి రూపంలో భగ్గుమనడం.. గ్రేటర్ రాజకీయాల్లో అసక్తిని రేకెత్తిస్తోంది.

Next Story

Most Viewed