'పెరిగిన డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం'

by  |
పెరిగిన డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం
X

దిశ, వెబ్‌డెస్క్: మహమ్మారి కారణంగా తగ్గిన డెబిట్, క్రెడిట్ కార్డుల వ్యయం నవంబర్‌లో గతేడాది స్థాయికి చేరుకుంటుందని ఆశిస్తున్నట్టు సిటీబ్యాంక్ అధికారి తెలిపారు. ఇటీవల ఆర్థిక పునరుజ్జీవన నిర్ణయాలు, బ్యాంకు పండుగ ఆఫర్లతో డెబిట్, క్రెడిట్ కార్డుల వ్యయంలో పెరుగుదల పరిశ్రమ వృద్ధికి దోహదపడుతుందని సిటీబ్యాంకు క్రెడిట్ కార్డులు, చెల్లింపులు హెడ్ అర్జున్ చౌదరీ చెప్పారు. నవంబర్‌లో, వినియోగదారుల ఖర్చులు గతేడాది ఇదే కాలంలో జరిగిన వినియోగంతో సమానంగా ఉంటుందని ఆశిస్తున్నాం.

ఈ-కామర్స్, కిరాణా దుకాణాలాల్లో చెల్లింపులు మెరుగ్గా ఉన్నాయని, విమానయాన సంస్థలు, ప్రయాణాలు సాధారణ స్థాయికి చేరుకున్నాక వినియోగం మరింత పెరుగుతుందని అర్జున్ చౌదరీ పేర్కొన్నారు. పండుగ సీజన్ కోసం బ్యాంక్ బ్రాండ్ టై-అప్ ద్వారా వందకుపైగా ఆఫర్లను ప్రకటించింది. ఇది ఈ ఏడాది డిసెంబర్ చివరి వరకు కొనసాగుతుందని, ఇప్పటికే అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయని వెల్లడించారు. ‘వినియోగదారుల వ్యయంలో పెరుగుదల రికవరీ స్థాయిలో ఉన్నాయని నమ్ముతున్నాం. మొబైల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వాషింగ్ మెషిన్ లాంటి ఎలక్ట్రానిక్స్ వినియోగ వస్తువులపై ప్రజలెక్కువగా ఖర్చు చేస్తుండటంతో అధిక వ్యయం నమోదవుతున్నట్టు’ సిటీబ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశు ఖుల్లార్ చెప్పారు.


Next Story

Most Viewed