జమ్మూ కశ్మీర్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు: పలు హైవేల మూసివేత

by samatah |
జమ్మూ కశ్మీర్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు: పలు హైవేల మూసివేత
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశమంతా వాతావరణం వేడెక్కి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే జమ్మూ కశ్మీర్‌లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కశ్మీర్‌లో వర్షాలు, హిమపాతం సంభవించడంతో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. దీంతో రియాజి జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో పాఠశాలలను అధికారులు మూసి వేశారు. కుండపోత వర్షాల వల్ల పూంచ్, ఉత్తర కశ్మీర్ లోని కొన్ని ప్రాంతాల్లో వరదలు, కొండ చరియలు విరిగిపడటం వల్ల తీవ్ర నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ మౌలిక సదుపాయాలతో పాటు ప్రయివేట్ ఆస్తులకు కూడా నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

అలాగే రాకపోకలకు సైతం అంతరాయం కలుగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. శ్రీనగర్- జమ్మూ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో ఆ రోడ్డును మూసివేశారు. దీంతో హైవేపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో లోయలోని మిగిలిన ప్రాంతాలతో కనెక్టివిటీ తెగిపోయింది. వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో సుమారు 336 కుటుంబాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

జీలం నదికి ఉపనది అయిన సీలు నది 1578.9 మీటర్ల ప్రమాదకర స్థాయిని అధిగమించింది. దీని వల్ల నీరు గ్రామాల్లోకి చేరుతుంది. ఈ కారణంగా కుప్వారా జిల్లాలోని హైవే దెబ్బతిన్నట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ వర్షాలు మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నందున శ్రీనగర్ పరిపాలన అధికారులు ప్రజలకు అడ్వైజరీని జారీ చేశారు. వాతావరణం మెరుగుపడే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జీలం నది దాని ఉపనదులు ప్రమాదకరంగా ఉన్నందున వాటి దగ్గరకు వెళ్లొద్దని హెచ్చరించారు. మే 2వ తేదీ నుంచి వాతావరణం మెరుగుపడే అవకావం ఉందని శ్రీనగర్‌లోని వాతావరణ శాఖ డైరెక్టర్ ముఖ్తార్ అహ్మద్ తెలిపారు.Next Story

Most Viewed