యువ నటి దివ్యాంక మృతి: గుండెపోటా లేక ఆర్థిక కష్టాలా?.. ఆ మిస్టరీ ఏంటి?

by Ramesh Naini |   (  Updated:2026-04-23 12:00:13  IST  )

హర్యాన్వి చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ యువ నటి, సోషల్ మీడియా సెన్సేషన్ దివ్యాంక సిరోహి (30) మంగళవారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.

యువ నటి దివ్యాంక మృతి: గుండెపోటా లేక ఆర్థిక కష్టాలా?.. ఆ మిస్టరీ ఏంటి?
X

దిశ, డైనమిక్ బ్యూరో: హర్యాన్వి చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ యువ నటి, సోషల్ మీడియా సెన్సేషన్ దివ్యాంక సిరోహి (30) మంగళవారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. చిన్న వయసులోనే ఆమె మృతి చెందడం అభిమానులను, చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. అయితే, ఈ హఠాన్మరణం వెనుక ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి ఉన్నట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

వైరల్‌గా మారిన కేదార్‌నాథ్ పోస్ట్..

దివ్యాంక మృతి తర్వాత ఆమె చేసిన ఓ పాత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆగస్టు 10, 2024న కేదార్‌నాథ్ ఆలయం వద్ద దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘శివయ్య.. నన్ను నీతో తీసుకెళ్లు’ అని ఆమె రాసుకొచ్చారు. ఇప్పుడు నిజంగానే ఆమె శివుని చెంతకు చేరడంతో ‘ఆమె కోరుకున్నట్లే జరిగింది’ అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరణం వెనుక అనుమానాలు..

దివ్యాంక మరణాన్ని కుటుంబ సభ్యులు సాధారణ గుండెపోటుగా చెబుతున్నప్పటికీ, పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవకాశాలు తగ్గడం, ఆర్థిక ఇబ్బందుల వల్ల గత కొద్ది రోజులుగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 15 రోజుల క్రితం ఆర్థిక సాయం కోసం ఆమె సన్నిహితులను సైతం సంప్రదించినట్లు సమాచారం. ఉపాధి లేకపోవడంతో గురుగ్రామ్ నుంచి ఘజియాబాద్‌లోని తన సొంతింటికి మకాం మార్చారు.

పోస్టుమార్టం లేకుండానే..

గుండెపోటుతో కిందపడి, తలకు గాయమై చనిపోయిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే.. ఎలాంటి పోలీసు ఫిర్యాదు లేకపోవడం, పోస్టుమార్టం నిర్వహించకుండానే మరుసటి రోజు ఉదయం హడావిడిగా అంత్యక్రియలు పూర్తి చేయడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. దివ్యాంక మృతిపై ఎలాంటి కుట్ర లేదని ఆమె సోదరుడు దీపాన్షు స్పష్టం చేశారు. గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో అపస్మారక స్థితిలో పడిపోయిందని, ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే మరణించిందని ఆయన తెలిపారు.

టిక్‌టాక్ టు సిల్వర్ స్క్రీన్..

ఉత్తరప్రదేశ్‌కు చెందిన దివ్యాంక.. ఉన్నత చదువులు (BCA, MBA) పూర్తి చేశారు. తొలుత టిక్‌టాక్ వీడియోలతో పాపులర్ అయిన ఆమె, ఆ తర్వాత దాదాపు 50కి పైగా హర్యాన్వి వీడియో సాంగ్స్‌లో నటించి మెప్పించారు. ఇటీవల ‘అంగద్’ అనే సినిమా షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకున్నారు. ఒకవైపు కెరీర్ పరంగా పోరాడుతూనే, చిన్న వయసులోనే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం స్థానిక చిత్ర పరిశ్రమను కలచివేస్తోంది.

Next Story