తలవంచి క్షమాపణలు కోరుతున్నా.. కన్నీళ్లు పెట్టిన రచయిత విజయేంద్ర ప్రసాద్

by Kema Shiva Kumar |

తన పూర్వీకులు చేసిన అమానవీయ ఘోరాలకు బాధ్యత వహిస్తూ, బహిరంగ వేదికపై ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కన్నీటి పర్యంతమై క్షమాపణలు కోరారు.

తలవంచి క్షమాపణలు కోరుతున్నా.. కన్నీళ్లు పెట్టిన రచయిత విజయేంద్ర ప్రసాద్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సామాజిక వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. తన పూర్వీకుల చరిత్రను గుర్తు చేసుకుంటూ ఆయన వ్యక్తం చేసిన పశ్చాత్తాపం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన ‘మాతా రాంబాయి అంబేడ్కర్ మెమొరియల్ అవార్డుల’ ప్రధానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘మాది చాలా సంపన్న కుటుంబం. నాకు తెలిసి నేను ఎప్పుడూ ఏ తప్పూ చేయలేదు. కానీ మా పూర్వీకులు అంటరానితనం పేరుతో నోటితో చెప్పలేనంత దారుణాలకు, భయంకరమైన ఘోరాలకు పాల్పడ్డారు. అవి తలుచుకుంటేనే ఇప్పుడు నాకు సిగ్గుగా ఉంది. ఆ దారుణాలకు ఒడిగట్టిన వారి రక్తమే నాలో ప్రవహిస్తోంది.. వారి ఆస్తులనే నేను అనుభవిస్తున్నాను. అందుకే ఆ పాపాల్లో నేను కూడా భాగస్వామినే. నా పూర్వీకుల తరఫున మీ అందరికీ తలవంచి క్షమాపణలు కోరుతున్నా’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

నా తండ్రికి కులపిచ్చి లేదు..

తన చిన్ననాటి స్నేహం గురించి వివరిస్తూ.. ‘నా చిన్ననాటి మిత్రుడు మాల సామాజిక వర్గానికి చెందిన జాన్ ఫెడ్రిక్ సుందర్ రావు. మేమిద్దరం పదో తరగతి వరకు పోటీపడి చదివాం. ఇద్దరం కలిసి లయోలా కాలేజీలో చేరాం. నా తండ్రికి అప్పట్లో కులపిచ్చి, మతపిచ్చి లేదు. ఆ అబ్బాయికి కూడా ఆయనే ఫీజు కట్టి, రూమ్ ఖర్చులు భరించి నాతో పాటు రూమ్‌మేట్‌గా ఉంచారు’ అని తన తండ్రి గొప్పతనాన్ని విజయేంద్ర ప్రసాద్ గుర్తుచేసుకున్నారు.

Next Story