- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్కార్ అవార్డుల్ని అమ్ముకోవచ్చా ? అకాడమీ రూల్స్ ఏంటి?
ఆస్కార్ అవార్డులను సినీరంగంతో ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డులుగా భావిస్తారు. మరి వాటిని అమ్ముకోవచ్చా? తయారీకయ్యే ఖర్చెంత?

దిశ, వెబ్‌డెస్క్: సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా పేరొందింది ఆస్కార్ అవార్డు. దీనినే అకాడమీ అవార్డ్స్ అని కూడా పిలుస్తారు. క్రీడాకారుడికి ఒలింపిక్ మెడల్ ఎంత గొప్పస్థాయిని ఇస్తుందో.. సినీ కళాకారుడికి ఆస్కార్ అవార్డు కూడా అంతే గొప్పది. అందుకే ఆస్కార్ ను సినీ ఒలింపిక్స్ అని కూడా పిలుస్తుంటారు. ఆస్కార్ నామినేషన్ దక్కించుకోవడమే ఒక గొప్ప విజయంగా భావిస్తారు. కేవలం కమర్షియల్ హిట్స్ మాత్రమే కాకుండా, కళాత్మక విలువలు, సాంకేతిక ప్రతిభ ఉన్న సినిమాలను ఇది గుర్తిస్తుంది. సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి విభాగాల్లో ఆస్కార్ ప్రమాణాలు చాలా కఠినంగా ఉంటాయి.
ఆస్కార్ బౌన్స్
ఆస్కార్ గెలిచిన లేదా నామినేట్ అయిన సినిమాలకు ఒక్కసారిగా క్రేజ్ పెరుగుతుంది. దీనివల్ల బాక్సాఫీస్ వసూళ్లు భారీగా పెరుగుతాయి. దీనినే 'ఆస్కార్ బౌన్స్' అని పిలుస్తారు. నటీనటులకు కూడా వారి రెమ్యూనరేషన్, భవిష్యత్తు అవకాశాలు మెరుగుపడతాయి. ఆస్కార్ విజేతలను ఎంపిక చేసేది ఎవరో ఇద్దరో ముగ్గురు కాదు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లో సభ్యులుగా ఉన్న సుమారు 10,000 మందికి పైగా సినీ నిపుణులు ఓటింగ్ ద్వారా విజేతలను ఎంచుకుంటారు. ఇందులో నటీనటులు, దర్శకులు, ఎడిటర్లు, రైటర్లు ఇలా ఆయా రంగాల్లో నిష్ణాతులు ఉంటారు. తోటి కళాకారుల నుంచి లభించే ప్రశంస కాబట్టి దీనికి విలువ ఎక్కువ. ఏ దేశంలో తీసిన సినిమాకైనా ఆస్కార్ వస్తే, ఆ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. ఉదాహరణకు, మన 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాలోని 'నాటు నాటు' పాటకు ఆస్కార్ వచ్చిన తర్వాత, ఆ సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంది. ఇది కేవలం అమెరికా అవార్డు మాత్రమే కాదు, అంతర్జాతీయ సినిమాకు ఒక కొలమానంలా మారిపోయింది.
అందుకే ఆస్కార్ కు అంత క్రేజ్..
ఆస్కార్ అవార్డులు 1929లో ప్రారంభమయ్యాయి. మొదటి అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం ఆ ఏడాది మే 16న హాలీవుడ్ రూజ్వెల్ట్ హోటల్‌లో జరిగింది. దాదాపు 95 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ అవార్డులు సినిమా రంగంలో అత్యంత పురాతనమైనవి. ఇంత సుదీర్ఘ కాలంగా తన ప్రమాణాలను కాపాడుకుంటూ రావడం వల్ల దీనికి ఒక ప్రత్యేక గౌరవం ఏర్పడింది. అందుకే ఆస్కార్ అవార్డులకు అంత క్రేజ్ ఉంటుంది.
మూడేళ్లు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో..
తొలి అవార్డు ఫంక్షన్లో ఎంజీఎం (MGM) స్టూడియో ఆర్ట్ డైరెక్టర్ సెడ్రిక్ గిబ్బన్స్ ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. ఒక యోధుడు ఐదు ఆకుల ఫిలిం రీల్‌పై నిలబడి, కత్తిని పట్టుకున్నట్లుగా ఇది ఉంటుంది. ఆ ఐదు ఆకులు అకాడమీలోని ఐదు మూలస్తంభాలైన నటులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, సాంకేతిక నిపుణులను సూచిస్తాయి. మొదట్లో దీనిని బంగారు పూత పూసిన కాంస్యంతో తయారు చేసేవారు. ప్రస్తుతం దీనిని 'బ్రిటానియమ్' అనే ఒక రకమైన లోహ మిశ్రమంతో తయారు చేసి, దానిపై 24 క్యారెట్ల బంగారు పూతను పూస్తారు. ఒక ఆస్కార్ అవార్డును తయారు చేసేందుకు సుమారు 400 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.33,000 ఖర్చవుతుంది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో లోహాల కొరత ఉండటంతో.. మూడు సంవత్సరాల పాటు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన అవార్డులను ఇచ్చారు. తర్వాత మళ్లీ లోహాలతో తయారు చేసిన అవార్డులను అందించారు..
అమ్మితే లీగల్ చర్యలే..
ఆస్కార్ అకాడమీ నిబంధనల ప్రకారం విజేతలు ఈ అవార్డును నేరుగా అమ్ముకునే వీల్లేదు. విజేతలు లేదా వారి వారసులు అవార్డును అమ్మాలనుకుంటే, మొదట దానిని అకాడమీకే అమ్మాల్సి ఉంటుంది. ఒక అవార్డుకు అకాడమీ ఒక డాలర్ మాత్రమే చెల్లిస్తుంది. అకాడమీకి తెలియకుండా బహిరంగ మార్కెట్లో ఆస్కార్ ను అమ్మితే.. వెంటనే కోర్టులో దావా వేసే హక్కు అకాడమీకి ఉంది. గతంలో చాలా సందర్భాల్లో ఇలా అమ్మకానికి పెట్టిన అవార్డులను అకాడమీ కోర్టు ద్వారా తిరిగి స్వాధీనం చేసుకుంది. ప్రతి విజేత అవార్డు తీసుకునే ముందే ఈ నిబంధనలకు కట్టుబడి ఉంటామని సంతకం చేయాల్సి ఉంటుంది. 1950 కంటే ముందు వచ్చిన అవార్డులపై ఈ నిబంధన వర్తించదు. అందుకే పాత అవార్డులు కొన్నిసార్లు వేలంలో కోట్లాది రూపాయలకు అమ్ముడవుతుంటాయి. ఉదాహరణకు, 'గాన్ విత్ ది విండ్' (1939) ఉత్తమ చిత్రం ఆస్కార్‌ను మైఖేల్ జాక్సన్ 1.5 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. ఆస్కార్ అవార్డుల చరిత్రలో ప్రముఖ సంగీత దర్శకుడైన జాన్ విలిమ్య్స్ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 1968 నుంచి 2024 వరకూ ఆయన కొన్ని దశాబ్దాలపాటు వరుసగా ఆస్కార్ నామినేషన్లు వేసేందుకు అర్హత సాధించారు. ఇప్పటి వరకూ ఆయన 54 నామినేషన్లు వేసి.. అత్యధిక ఆస్కార్ నామినేషన్లు పొందిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.






