Tollywood: కుమారస్వామి కథలకు భారీ డిమాండ్.. లిస్టులో ఆ దర్శకులు

by Pulgam srinivas |

కుమారస్వామి కథలపై ఆసక్తి చూపుతున్న త్రివిక్రమ్, కిషోర్ తిరుమల, ప్రశాంత్ వర్మ

Tollywood: కుమారస్వామి కథలకు భారీ డిమాండ్.. లిస్టులో ఆ దర్శకులు
X

దిశ, వెబ్ డెస్క్: గత కొంతకాలంగా డివోషనల్ టచ్ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా భక్తి నేపథ్యంలో రూపొందుతున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. దీంతో పలువురు స్టార్ ఫిలిం మేకర్స్ కూడా ఇప్పుడు భక్తి కథలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో కుమారస్వామి కథల ఆధారంగా సినిమాలు రూపొందించేందుకు టాలీవుడ్‌లో పలువురు ప్రముఖ దర్శకులు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

ముఖ్యంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే కుమారస్వామి నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన కథను సిద్ధం చేసి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయ్యిన వెంటనే ఈ సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారని, అందుకు సరిపడే హీరో కోసం అన్వేషణ కొనసాగుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అలాగే దర్శకుడు కిషోర్ తిరుమల కూడా కుమారస్వామి నేపథ్యంలో ఒక కథను రాసుకున్నట్లు సమాచారం. ఈ కథకు సరిపోయే హీరోను ఎంపిక చేసే ప్రక్రియలో ఆయన ఉన్నారని, అన్నీ అనుకూలిస్తే ఈ ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా కుమారస్వామి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పూర్తి స్థాయి కథను సిద్ధం చేసుకున్నారని సమాచారం. అయితే ఈ ప్రాజెక్టుకి ఆయన దర్శకుడిగా కాకుండా నిర్మాతగా వ్యవహరించాలని భావిస్తున్నారని, సరైన దర్శకుడు దొరికితే ఆ కథను అతని చేతిలో పెట్టి సినిమా నిర్మించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే, ప్రస్తుతం టాలీవుడ్‌లో పలువురు స్టార్ ఫిలిం మేకర్స్ కుమారస్వామి కథలపై దృష్టి సారించడం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Next Story