తెలుగు గ్రాఫిక్స్ సినిమాల పరిస్థితి ఇది.. ఒకటి తప్పితే అన్నింటిదీ అదే దారి

by Pulgam srinivas |

ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న భారీ గ్రాఫిక్స్ చిత్రాలలో ‘నాగబంధం’ను మినహాయిస్తే మిగతా సినిమాల విడుదల తేదీల విషయంలో పూర్తి స్పష్టత రావడం లేదు.

తెలుగు గ్రాఫిక్స్ సినిమాల పరిస్థితి ఇది.. ఒకటి తప్పితే అన్నింటిదీ అదే దారి
X

దిశ, వెబ్ డెస్క్: గతంతో పోలిస్తే ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో గ్రాఫిక్స్ సినిమాల సంఖ్య భారీగా పెరిగింది. వీఎఫ్ఎక్స్ ఆధారిత సినిమాలతో వచ్చే అతి పెద్ద సమస్య ఏమిటంటే సమయానికి ఔట్‌పుట్ రాకపోవడం. ఒకవేళ వచ్చినా అది సంతృప్తికరంగా లేకపోతే మళ్లీ దానిపై రీవర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ కారణాల వల్ల మేకర్స్ ముందుగా ప్రకటించిన తేదీకి సినిమాలు విడుదల కావడం చాలా కష్టంగా మారుతోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో కూడా పలు భారీ గ్రాఫిక్స్ సినిమాలు రూపొందుతున్నాయి. అయితే వాటి విడుదల తేదీల విషయంలో మేకర్స్ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సినిమా చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని మొదట 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత పలు తేదీలు ప్రచారంలోకి వచ్చినప్పటికీ ఇప్పటివరకు సినిమా విడుదల కాలేదు. ఇంకా విడుదల తేదీపై అధికారిక స్పష్టత కూడా రాలేదు. నిఖిల్ హీరోగా రూపొందుతున్న ‘స్వయంభు’ చిత్ర పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ మూవీ విడుదల తేదీపై కూడా ఇంకా క్లారిటీ రావడం లేదు.

అలాగే నాగచైతన్య హీరోగా రూపొందుతున్న ‘వృషకర్మ’, సాయి దుర్గ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రాల విడుదల తేదీల విషయంలో కూడా పూర్తి స్పష్టత కనిపించడం లేదు. ఇక భారీ గ్రాఫిక్స్‌తో రూపొందుతున్న మరో చిత్రం ‘నాగబంధం’. ఈ మూవీ మాత్రం జూలై 3వ తేదీన పక్కాగా విడుదల కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్‌లో రూపొందుతున్న ఈ ఐదు భారీ గ్రాఫిక్స్ చిత్రాల్లో ‘నాగబంధం’ మినహా మిగతా సినిమాల విడుదల తేదీలపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఏ తేదీన విడుదల అయినా కూడా ఈ చిత్రాల్లోని గ్రాఫిక్స్ అద్భుతంగా ఉండాలని, వీటి ద్వారా తెలుగు పరిశ్రమ ఖ్యాతి మరింత పెరగాలని చాలామంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

Next Story