హీరోయిన్‌గా తీసుకుంటామని నన్ను మోసం చేశారు.. విజయ్ మూవీ టీమ్‌పై సోనా సంచలన ఆరోపణలు

by Mallepaka Hamsa |

షూటింగ్ సమయంలో తాను తీవ్ర అవమానానికి గురైన ఒక సంఘటనను సోనా బయటపెట్టింది.

హీరోయిన్‌గా తీసుకుంటామని నన్ను మోసం చేశారు.. విజయ్ మూవీ టీమ్‌పై సోనా సంచలన ఆరోపణలు
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కెరీర్‌లో వచ్చిన క్లాసిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా ‘షాజహాన్’. 2001లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో రిచా పల్లోడ్ హీరోయిన్‌గా నటించగా.. కృష్ణ, వివేక్ కీలక పాత్రలు పోషించారు. అయితే, ఈ సినిమాలో వచ్చే ఒకే ఒక్క ఐటమ్ సాంగ్‌తో ఊహించని పాపులారిటీ తెచ్చుకుంది నటి సోనా. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు జరిగిన ఒక చేదు అనుభవాన్ని పంచుకుంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. షూటింగ్ సమయంలో తాను తీవ్ర అవమానానికి గురైన ఒక సంఘటనను సోనా బయటపెట్టింది. "ఒక సీన్ షూట్ చేసిన తర్వాత, చిత్రబృందంలోని కొందరు నన్ను పక్కకు పిలిచారు. ఆ కాస్ట్యూమ్స్, మేకప్‌లో నేను మెయిన్ హీరోయిన్ కంటే చాలా ఎక్కువ ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తున్నానని చెప్పారు.

ఆ తర్వాత హీరోయిన్ డామినేట్ అవ్వకూడదనే ఉద్దేశంతో నా లుక్‌ను, రూపాన్ని బలవంతంగా మార్చేశారు. అప్పట్లో నా వయసు కేవలం 19 ఏళ్లు మాత్రమే. సినిమా ఇండస్ట్రీకి నేను చాలా కొత్త. ఆ వయసులో ఆ సంఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. సెట్‌లోనే అందరి ముందు ఏడ్చేశాను" అంటూ సోనా తన బాధను పంచుకుంది. నటి సోనా ఆ రోజులను గుర్తుచేసుకుంటూ.. "‘షాజహాన్’ నేను సైన్ చేసిన నాటికీ అది నా కెరీర్‌లో కేవలం రెండవ సినిమా మాత్రమే. కథ చెప్పేటప్పుడు చిత్రబృందం నన్ను సెకండ్ హీరోయిన్‌గా తీసుకుంటున్నామని, కథలో నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. తీరా షూటింగ్ మొదలయ్యాక చూస్తే నా పాత్రను పూర్తిగా మార్చేశారు. చివరికి నన్ను కేవలం ఓ ఐటమ్ సాంగ్‌కు మాత్రమే పరిమితం చేశారు. వారు చెప్పినదానికి, స్క్రీన్‌పై చూపించినదానికి అస్సలు సంబంధం లేదు" అని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Next Story