నాకు రావాల్సిన డబ్బులు అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారు.. నటుడు సంచలన పోస్ట్

by Mallepaka Hamsa |

సత్యేంద్ర సోనీ మధ్యప్రదేశ్‌లో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నందుకు తనకు రావాల్సిన పారితోషికం అడిగితే.. దర్శకుడు, నిర్మాత కలిసి తనను చంపేస్తామని బెదిరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నాకు రావాల్సిన డబ్బులు అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారు.. నటుడు సంచలన పోస్ట్
X

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో షూటింగ్‌లు పూర్తి చేసుకున్న తర్వాత కూడా నటీనటులకు, టెక్నీషియన్లకు పారితోషికాలు సకాలంలో అందకపోవడం అనేది తరచూ వినే విషయమే. తమకు రావాల్సిన డబ్బుల కోసం కొందరు నిర్మాతల చుట్టూ తిరిగితే.. మరికొందరు విసిగిపోయి సోషల్ మీడియా ద్వారా తమ ఆవేదనను బయటపెడుతుంటారు. ఇటీవల టాలీవుడ్ హీరోయిన్ చాందిని చౌదరి కూడా తాను నటించిన ఒక సినిమాకు సంబంధించి పారితోషికం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని వెల్లడించారు. అయితే ఆ సినిమా ఏంటనేది మాత్రం తాను బయటపెట్టనని చెప్పి సస్పెన్స్‌లో ఉంచారు. ఇక ఇప్పుడు మరో నటుడు తనకు రెమ్యురేషన్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అమీర్ ఖాన్ నిర్మాణంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘లాపతా లేడీస్’ లో కీలక పాత్ర పోషించిన నటుడు సత్యేంద్ర సోనీ మధ్యప్రదేశ్‌లో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నందుకు తనకు రావాల్సిన పారితోషికం అడిగితే.. దర్శకుడు, నిర్మాత కలిసి తనను చంపేస్తామని బెదిరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పుష్పేంద్ర సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పేడ్ పాల్కి’ అనే సినిమా షూటింగ్ కోసం ఆయన మధ్యప్రదేశ్‌లోని మైహార్‌కు వెళ్లానని.. కేవలం 50 వేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి, మిగిలిన డబ్బులు షూటింగ్ సమయంలో ఇస్తామని మేకర్స్ ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే మొత్తం 10 రోజుల షూటింగ్‌లో భాగంగా సత్యేంద్ర 8 రోజులు కష్టపడి పనిచేసినప్పటికీ.. మిగిలిన పేమెంట్ అడిగినందుకు దర్శకుడు పుష్పేంద్ర సింగ్ ఒక్కసారిగా రెచ్చిపోయి.. "10 నిమిషాల్లో హోటల్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, ఇక్కడ కనిపిస్తే చంపేస్తాం" అంటూ ఘోరంగా బెదిరించారని ఏడుస్తున్న వీడియోను రిలీజ్ చేశారు. అంతేకాకుండా, ఆ సినిమా హీరోయిన్, దర్శకుడి భార్య అయిన ప్రగతి చౌహాన్ కూడా తనను అసభ్య పదజాలంతో దూషించిందని అన్నారు. ప్రాణ భయంతో హోటల్ నుండి వచ్చేటప్పుడు తోటి నటులు శ్రీధర్ దూబే, పంకజ్ శర్మ తనతో పాటు వచ్చారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆయనకు అండగా నిలుస్తున్నారు. అయితే ఈ విషయంపై స్పందించిన 'ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్' (AICWA) నటుడు సత్యేంద్ర సోని ఆరోపణల ఆధారంగా సదరు నిర్మాత, దర్శకుడిపై వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, ఈ విషయంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తుందని సమాచారం.

Next Story