- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రణాళిక రహిత నిర్మాణాలే వరద ముంపునకు కారణం : చర్చాగోష్టిలో డా. దొంతి నరసింహారెడ్డి
హైదరాబాద్‌లో వరద సమస్యలు, ప్రభుత్వ సన్నద్ధతపై హెచ్‌సీఎఫ్, యూడీఎఫ్ ఆధ్వర్యంలో చర్చాగోష్టి జరిగింది. ఇందులో పలువురు నిపుణులు పాల్గొని ప్రసంగించారు.

దిశ, రాంనగర్ : హైదరాబాద్‌లో వరద నీటి కష్టాలు - ప్రభుత్వ సన్నద్ధత అనే అంశం పై హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం (హెచ్‌సీఎఫ్), అర్బన్ డెవలప్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన చర్చాగోష్టిలో అర్బన్ పాలసీ నిపుణులు డా. దొంతి నరసింహారెడ్డి, పర్యావరణవేత్త డాక్టర్ లుబ్నా సర్వత్, యూడీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఎం. శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డా.దొంతి నరసింహారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ చట్టాలకు విరుద్ధంగా ప్రణాళిక రహితంగా నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం కారణంగానే వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడి వరద ముంపుకు దారితీస్తున్నాయని అన్నారు. అదేవిధంగా రైలు పిల్లర్ల మధ్య నిర్మాణాలు కూడా వరదలకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు. రోడ్లు, ఫ్లై ఓవర్లు కాల్వల్లా మారిపోవడానికి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే కారణమని అన్నారు. వాటర్ లాగింగ్ పాయింట్లలో తగిన చర్యలు చేపట్టకపోవడమే ఈ దుస్థితికి కారణమన్నారు.
వాటర్‌షెడ్‌లు, ఇంకుడు గుంతల నిర్మాణాన్ని అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. వర్షాకాల సమస్యల పై అధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి, నగరంలో ప్రజా సమస్యల పై పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు, పర్యావరణవేత్తలు, సంక్షేమ సంఘాలతో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. తక్షణమే వారితో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పర్యావరణంలో వస్తున్న మార్పులు, హీట్ ఐలాండ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పట్టణ ప్రణాళికలను రూపొందించాలని, వర్షపు నీటిని నిల్వ చేసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ లుబ్నా సర్వత్ మాట్లాడుతూ బంజారాహిల్స్‌లోని వరద నీరు పల్లానికి ప్రవహించి ఏనుగుల కుంటలో చేరేదని, ప్రస్తుతం అక్కడ పార్కు నిర్మించడం వల్ల ఆ నీళ్లు రోడ్లు, ఇళ్లు, అపార్ట్‌మెంట్లలోకి వస్తున్నాయని విమర్శించారు. హైడ్రా చెరువుల సుందరీకరణకు ఇస్తున్న ప్రాధాన్యతను చెరువుల విస్తీర్ణం, లోతులకు ఇవ్వడం లేదని అన్నారు. ప్రతి డబుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్ నిర్మాణం వద్ద తప్పనిసరిగా ఒక ఇంకుడు గుంత నిర్మించాలని ప్రభుత్వానికి సూచించారు.
అర్బన్ డెవలప్‌మెంట్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ జూన్ 9న కురిసిన వర్షానికి అనేక చెట్లు కూలాయని, విద్యుత్ తీగలు తెగిపోయాయని, స్టీల్ బ్రిడ్జి పై కూడా నీళ్లు నిలిచాయని, ఇది హైదరాబాద్ వాస్తవ పరిస్థితిని బట్టబయలు చేసిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వరదల్లో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వలేదని, ఇది ప్రభుత్వ బాధ్యతారాహిత్యమని విమర్శించారు. నిమ్స్ వద్ద రోడ్డు పై ఉన్న చిన్న గుడి రాకపోకలకు తీవ్ర ఆటంకంగా ఉందని, రోడ్డు పక్కన ఉన్న గుడులు, మసీదులు, చర్చిలను సమీపంలోని స్థలాలకు మార్చి ట్రాఫిక్ ఇబ్బందులను నివారించేందుకు హైడ్రా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఎఫ్ ప్రధాన కార్యదర్శి కె. వీరయ్య, ఉపాధ్యక్షులు మల్లం రమేష్, హెచ్‌సీఎఫ్ నగర నాయకులు పి. శ్రీనివాసరావు, రాజమౌళి, డి. సైదులు, సంగీత, శ్వేత, కె. రమేష్, సుకుమార్, గోపాల్, నాగేష్, శంకరయ్య, రింగ్ సాయిలు, మోహన్, ఆర్.ఈ.బాబు, నరసింగరావు పాల్గొన్నారు.






