గత రెండేళ్లు నా జీవితంలో అత్యంత కఠినమైన కాలం.. నరకం చూశానంటూ హన్సిక ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

మనం పొరపాటున ఒక తప్పు ట్రైన్ ఎక్కితే, అది చివరి గమ్యస్థానానికి చేరేవరకు అందులోనే కూర్చోవాల్సిన అవసరం లేదు. తదుపరి స్టేషన్ రాగానే దిగిపోవాలి.

గత రెండేళ్లు నా జీవితంలో అత్యంత కఠినమైన కాలం.. నరకం చూశానంటూ హన్సిక ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి నటించి స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హన్సిక కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న సమయంలోనే ఆమె సోహైల్ ఖతూరియాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లయిన కొద్ది రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. విడాకుల తర్వాత హన్సిక మళ్లీ తన సినీ కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టింది. ఇదిలా ఉండగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హన్సిక.. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన చేదు సంఘటనలను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యింది. జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు తప్పు అవ్వచ్చని, అలాంటి కఠిన పరిస్థితుల్లో ధైర్యంగా ముందుకు సాగడం చాలా ముఖ్యమని హన్సిక తెలిపింది. దీనికి ఉదాహరణగా చెప్తూ.. "మనం పొరపాటున ఒక తప్పు ట్రైన్ ఎక్కితే, అది చివరి గమ్యస్థానానికి చేరేవరకు అందులోనే కూర్చోవాల్సిన అవసరం లేదు. తదుపరి స్టేషన్ రాగానే దిగిపోవాలి.

మనకు అది సరైన మార్గం కాదని తెలిసిన వెంటనే వెనక్కి వచ్చేయాలి. ఇదే సూత్రం జీవితానికి కూడా వర్తిస్తుంది" అంటూ తన విడాకుల నిర్ణయాన్ని పరోక్షంగా సమర్థించుకుంది. గత రెండేళ్లుగా తాను జీవితంలో అత్యంత కఠినమైన కాలాన్ని గడిపినట్లు హన్సిక ఆవేదన వ్యక్తం చేసింది. ఎప్పుడూ నవ్వుతూ, ఎంతో ఉల్లాసంగా ఉండే తాను మానసికంగా పూర్తిగా మారిపోయానని.. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల చాలా బాధ అనుభవించానని నరకం చూశానని చెప్పింది. అంత యాక్టివ్‌గా ఉండే తను ఒక్కసారిగా మౌనంగా మారిపోవడం చూసి తన తల్లి, అన్నయ్య ఎంతో ఆందోళన చెందారని గుర్తుచేసుకుంది. తన మానసిక పరిస్థితి ఇంకా దిగజారకుండా ఉండటానికి కుటుంబ సభ్యులు తనకు అండగా నిలిచారని, వారి సహాయంతోనే తాను థెరపీ కూడా తీసుకున్నట్లు వెల్లడించింది. ఇక విడాకుల తర్వాత తనపై వచ్చిన విమర్శల గురించి హన్సిక గట్టిగానే స్పందించింది. విడిపోయిన తర్వాత తనపై సోషల్ మీడియాలో, వెబ్‌సైట్లలో అనేక రకాల వార్తలు వచ్చాయని.. చాలామంది అసలు నిజం తెలుసుకోకుండానే తమకు తోచినట్లు మాట్లాడారని మండిపడింది. అయితే వాటిపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని తేల్చి చెప్పింది. ప్రజలకు కేవలం సంచలన హెడ్‌లైన్స్, క్లిక్‌బైట్స్ మాత్రమే కావాలని, వాటి కోసమే ఎన్నో కల్పిత కథలు సృష్టించారని విమర్శించింది. తాను ఎప్పుడూ ఎవరికీ వివరణ ఇవ్వలేదని, ఇకముందు కూడా ఇవ్వనని స్పష్టం చేసింది.

Next Story