ఆన్‌లైన్ ప్రపంచం భారంగా అనిపిస్తోంది.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ రియా చక్రవర్తి ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

సోషల్ మీడియాలోని నిరంతర శబ్దం, స్క్రోలింగ్, ఆన్‌లైన్ ప్రపంచంతో పోటీ పడటం.. ఇవన్నీ నేను ఊహించిన దానికంటే ఎక్కువ భారంగా అనిపిస్తున్నాయి.

ఆన్‌లైన్ ప్రపంచం భారంగా అనిపిస్తోంది..  అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ రియా చక్రవర్తి ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి రియా చక్రవర్తి పలు చిత్రాల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా తన ప్రియుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత జరిగిన దర్యాప్తులో రియా చక్రవర్తి అరెస్ట్ కావడంతో ఆమెపై విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్న రియా, బెయిల్ రావడానికి ముందు దాదాపు 28 రోజుల పాటు జైల్లో గడిపారు. అప్పటి నుండి సోషల్ మీడియా ట్రోలింగ్‌ను ఎదుర్కొంటూనే తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇటీవల కాలంలో ఆమె ఒక పాడ్‌కాస్ట్ ప్రారంభించడంతో పాటు 'ఎమ్‌టీవీ రోడీస్' షోలో గ్యాంగ్ లీడర్‌గా కూడా కనిపించారు. చాలా కాలం పాటు స్క్రీన్‌కు దూరంగా ఉన్న రియా చక్రవర్తి నెట్‌ఫ్లిక్స్ తీసుకురాబోతున్న ‘ఫ్యామిలీ బిజినెస్’ అనే కొత్త సిరీస్ ద్వారా ఆమె మళ్లీ నటనలోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ప్రసిద్ధ దర్శకుడు హన్సల్ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో అనిల్ కపూర్, విజయ్ వర్మ, నేహా ధూపియా , ధృవ్ సెహగల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న ఈ ప్రాజెక్ట్, రియాకు నటిగా మంచి కంబ్యాక్ అవుతుందని భావిస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, రియా కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాకు కొంతకాలం పాటు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. నిరంతరం వేగంగా సాగిపోయే ఆన్‌లైన్ ప్రపంచం మానసికంగా తనను అలసిపోయేలా చేస్తోందని ఆమె వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేస్తూ.. ఆన్‌లైన్ ఒత్తిడికి దూరంగా ఉంటూ, నిజ జీవితంలో తనను తాను మళ్లీ కనుగొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. "ఈ మధ్య కాలంలో నన్ను నేను కాస్త మిస్ అవుతున్నట్లు అనిపిస్తోంది. సోషల్ మీడియాలోని నిరంతర శబ్దం, స్క్రోలింగ్, ఆన్‌లైన్ ప్రపంచంతో పోటీ పడటం.. ఇవన్నీ నేను ఊహించిన దానికంటే ఎక్కువ భారంగా అనిపిస్తున్నాయి. ప్రతి క్షణాన్ని కెమెరాలో బంధించాలనే ఆలోచన లేకుండా ప్రశాంతంగా గడపడాన్ని, నిశ్శబ్దాన్ని నేను మిస్ అవుతున్నాను. అందుకే కాస్త నెమ్మదించడానికి, ప్రశాంతంగా శ్వాస తీసుకోవడానికి సోషల్ మీడియా నుండి ఒక అడుగు వెనక్కి వేస్తున్నాను. ప్రస్తుతానికి పోస్ట్ చేసిన వాటి కంటే నిజ జీవితంలో గడిపిన క్షణాలకే ప్రాధాన్యత ఇస్తున్నాను. త్వరలో కలుద్దాం" అని రియా ఎమోషనల్ అయ్యారు. ఈ విషయంలో కొందరు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Next Story