ఇరుముడి నుంచి 'ఇరుముడి కట్టు' సాంగ్ వచ్చేసింది.

by Pulgam srinivas |

రవితేజ నటిస్తున్న 'ఇరుముడి' చిత్రం నుంచి తొలి పాట 'ఇరుముడి కట్టు' విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది.

ఇరుముడి నుంచి ఇరుముడి కట్టు సాంగ్ వచ్చేసింది.
X

దిశ, వెబ్ డెస్క్: మాస్ మహారాజా రవితేజ హీరోగా, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఇరుముడి'. ఈ సినిమా నుంచి తొలి పాట 'ఇరుముడి కట్టు'ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పుడు ఈ భక్తి గీతం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. జి.వి. ప్రకాష్ కుమార్ స్వరపరిచిన 'ఇరుముడి కట్టు' పాట అయ్యప్ప స్వామి భక్తి, మండల దీక్ష, శబరిమల యాత్ర నేపథ్యాన్ని ఆధ్యాత్మిక భావోద్వేగాలతో ఆవిష్కరించింది.

ఈ పాటకు దర్శకుడు శివ నిర్వాణ, కళ్యాణ్ చక్రవర్తి కలిసి సాహిత్యం అందించగా, అనంతు తన గాత్రంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ పాటలో అయ్యప్ప మాల ధరించిన భక్తుడి పాత్రలో రవితేజ లుక్, హావభావాలు ఆకట్టుకుంటాయి. అలాగే ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర కనిపించే భావోద్వేగ సన్నివేశాలు పాటకు మరింత బలాన్ని చేకూర్చాయి. బాబా భాస్కర్ కొరియోగ్రఫీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంలో సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. గత కొంతకాలంగా రవితేజ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. అయితే ఈసారి ఆయన తొలిసారిగా భక్తి ప్రధాన కథాంశంతో కూడిన చిత్రంలో నటిస్తుండటం, ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, తొలి పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో 'ఇరుముడి'పై అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రంతో రవితేజ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటారో లేదో చూడాలి.

Next Story