సమాజానికి అవసరమైన చిత్రం " ది అవార్డ్ 1996"

by Muthe.Rajitha |

దేశానికి రైతన్న ఎంత ముఖ్యమో దేహానికి నేతన్న అంతే ముఖ్యం.

సమాజానికి అవసరమైన చిత్రం  ది అవార్డ్ 1996
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశానికి రైతన్న ఎంత ముఖ్యమో దేహానికి నేతన్న అంతే ముఖ్యం. అలాంటి చేనేత రంగంలో ప్రతిభావంతులైన కళాకారులు దళారుల చేతుల్లో ఎలా మోసపోతున్నారనే కథాంశంతో భూదాన్ పోచంపల్లికి చెందిన యువ దర్శకుడు బడుగు విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం "ది అవార్డ్ 1996". పలు యదార్థ సంఘటనల ఆధారంగా మెగా మేజ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై శ్రీకాంత్ సి సమర్పణలో చిరందాసు ధనుంజయ్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబుగారి చేతుల మీదుగా 'ది అవార్డ్' ట్రైలర్ ను ఆదివారం విడుదల చేశారు. ట్రైలర్ ఆధ్యంతం వీక్షించిన సురేష్ బాబు, దర్శక నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను అభినందించారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. "ది అవార్డు 1996 ట్రైలర్ చాలా బాగుంది. మంచి హృదయంతో ఈ సినిమా తీశారు. చేనేత కళాకారులు, వారి సమస్యలను సమాజానికి చూపించాలనుకోవడం అభినందనీయం. సోషల్ రిలవెంట్ టాఫిక్ ఇది, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది" అన్నారు.

అనంతరం చిత్ర యూనిట్ కు సంబంధించిన ఇతర వివరాలను సురేష్ బాబు అడిగి తెలుసుకున్నారు. తమ మూవీ ట్రైలర్ ను సురేష్ బాబు విడుదల చేయడం పట్ల నిర్మాత ధనుంజయ్ ఆనందం వ్యక్తం చేశారు. ఎంతో అనుభవం ఉన్న నిర్మాత సురేష్ బాబుకు ట్రైలర్ నచ్చడం, సినిమా గురించి అడిగి తెలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ట్రైలర్ కంటే సినిమాలో ప్రేక్షకులకు ఆకట్టుకునే ఎన్నో అంశాలున్నాయన్నారు. త్వరలోనే ది అవార్డ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు. ఈ చిత్రంలో శివరామ్ రెడ్డి, సాయి చందన జంటగా నటించగా బన్నీ అభిరన్ కీలక పాత్ర పోషించారు. ప్రశాంత్ మార్క్ సంగీతాన్ని అందించగా లింగా గౌడ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. రాజ్ చెన్నూరి, పవన్ ఎడిటింగ్ చేశారు.





Next Story