Oscar Awards: 2026 ఆస్కార్ అవార్డ్స్ షెడ్యూల్ వచ్చేసింది!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-22 03:58:06  IST  )

ప్రపంచవ్యాప్తంగా సినీ, కళ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆస్కార్.

Oscar Awards: 2026 ఆస్కార్ అవార్డ్స్ షెడ్యూల్ వచ్చేసింది!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా సినీ, కళ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆస్కార్ (Oscar). దీనికే అకాడమీ అవార్డులు అని కూడా అంటారు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ ఆస్కార్ అవార్డు అందుకోవాలనే కలలు కంటారు. కానీ ఆస్కార్ దక్కడం అంటే మామూలు విషయం కాదు. మార్చి 2న లాస్‌ ఏంజిల్స్‌లోని (Los Angeles) డాల్బీ అట్మాస్‌ థియేటర్‌లో 97వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా 2026లో జరుగనున్న 98వ ఆస్కార్ అవార్డుల వేడుక తేదీలను ఆస్కార్‌ నిర్వాహకులు వెల్లడించారు. అలాగే ఈసారి కొన్ని కొత్త నిబంధనలను కూడా ప్రవేశపెట్టారు.

వచ్చే ఏడాది మార్చి 15న జరగనున్నట్లు అకాడమీ ఆఫ్ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ తెలిపింది. అందుకు నామినేట్‌ అయిన చిత్రాల జాబితాను జనవరి 22న వెల్లడిస్తామని పేర్కొంది. అయితే కొన్ని కేటగిరీల్లో ఓటింగ్‌ విధానంలో మార్పులు చేసినట్లు తెలిపింది. నామినేట్‌ చేసిన ప్రతి చిత్రాన్ని అకాడమీ సభ్యులు కచ్చితంగా వీక్షించాలని పేర్కొంది. అలాగే అచీవ్‌మెంట్‌ ఇన్‌ కాస్టింగ్‌ అనే కేటగిరీని ప్రవేశపెట్టింది. ఈ కేటగిరీకి రెండు దశల్లో ఓటింగ్‌ ప్రక్రియ ఉండనుందని, ఫైనల్ ఓటింగ్ ముందు కాస్టింగ్‌ డైరెక్టర్లకు కొన్ని రౌండ్ల టెస్టింగ్ ఉంటుందని వెల్లడించింది. అలాగే, ఈసారి AI ఉపయోగించిన చిత్రాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు ప్రకటించారు.

అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌ (Los Angeles)లో ఈ వేడుక జరగనుంది. 2025 జనవరి నుంచి డిసెంబర్‌ వరకు విడుదలైన చిత్రాలకు అస్కార్‌ ఎంట్రీకి అవకాశం ఉంటుంది. కానీ, ఒరిజినల్ సాంగ్ విభాగం కోసం మాత్రం 2025 నవంబర్‌ 3 వరకు విడుదలైన మూవీలకు మాత్రమే ఛాన్స్‌ ఉంటుంది. ఇక అకాడమీ 'స్టంట్‌ డిజైన్‌' (Stunt Design category) జాబితాలోనూ అవార్డులు ఇవ్వనున్నట్లు ఇటీవల అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. 2027 నుంచి విడుదల కానున్న చిత్రాలను ఈ జాబితాలో ఎంపిక చేసి అవార్డులు ఇవ్వనున్నారు.

Next Story