కష్టపడి సంపాదించుకున్న పేరును పోగొట్టుకుంటున్నా: సింగర్ మంగ్లీ ఆవేదన

by Gantepaka Srikanth |

గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న మైక్రో ఫైనాన్స్ కుంభకోణం ఆరోపణలపై ప్రముఖ గాయని మంగ్లీ తీవ్రంగా స్పందించారు.

కష్టపడి సంపాదించుకున్న పేరును పోగొట్టుకుంటున్నా: సింగర్ మంగ్లీ ఆవేదన
X

దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న మైక్రో ఫైనాన్స్ కుంభకోణం ఆరోపణలపై ప్రముఖ గాయని మంగ్లీ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆమె ఒక వివరణాత్మక వీడియోను విడుదల చేస్తూ, తనపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఈ వివాదంపై మంగ్లీ మాట్లాడుతూ.. "మైక్రో ఫైనాన్స్ అనే పదం నాకు ఇంతకు ముందెప్పుడూ తెలియదు. అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశానని అభియోగం రావడం నన్ను, నా వాళ్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నా వృత్తి పాటలు పాడటం, కార్యక్రమాలు చేయడం మాత్రమే. అంతకు మించి నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు" అని వివరించారు. "నిజానికి నేను కూడా ఒక బాధితురాలినే. ఈ స్కామ్‌లో డబ్బులు పోగొట్టుకున్న వారు ఆర్థికంగా నష్టపోతే, నేను జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న పేరును పోగొట్టుకుంటున్నాను. నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏ తప్పూ చేయలేదు..

తాను ఏనాడూ తప్పుడు పనులు చేయలేదని, భవిష్యత్తులో కూడా చేయబోనని మంగ్లీ ఉద్వేగానికి లోనయ్యారు. తన పేరు వాడుకుని ఎవరైనా మోసాలకు పాల్పడితే దానికి తనకు సంబంధం లేదని, వాస్తవాలు తెలుసుకోకుండా నిందలు వేయవద్దని ఆమె కోరారు. మైక్రో ఫైనాన్స్ వ్యాపారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మంగ్లీ విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వివాదానికి సంబంధించి త్వరలోనే పూర్తి నిజానిజాలు బయటకు వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story