- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సీనియర్ ఎన్టీఆర్ మునిమనవడు మూవీ లాంఛింగ్ డేట్ ఫిక్స్..?

దిశ, వెబ్ డెస్క్ : తెలుగుజాతి ముద్దుబిడ్డ, దివంగత సీనియర్ ఎన్టీఆర్ మునిమనవడు, హరికృష్ణ మనవడు, జానకిరామ్ తనయుడు అయిన తారక రామారావు హీరోగా వైవీఎస్ చౌదరి ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఇదివరకే ఎన్టీఆర్ కుటుంబం నుండి ఎందరో హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసిన వైవీఎస్ చౌదరి, ఇప్పుడు ఈ కుర్ర ఎన్టీఆర్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమయ్యారు. 'ఫస్ట్ దర్శన్' అంటూ హీరో హీరోయిన్ల వివరాలను తెలియజేస్తూ, ఇటీవలే ఘనంగా ప్రెస్ మీట్లు కూడా నిర్వహించారు.
న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌పై వైవీఎస్ చౌదరి సతీమణి యలమంచిలి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రమేశ్ అత్తిలి సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాతో కూచిపూడి నృత్యకారిణి వీణా రావు హీరోయిన్గా టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి పదునైన మాటలు అందిస్తున్నారు. ఇక సంగీతం విషయానికొస్తే, ఆస్కార్ అవార్డు గ్రహీతలు కీరవాణి సంగీతం, చంద్రబోస్ సాహిత్యం అందించనుండటం ఈ సినిమాకు మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఇదివరకే నందమూరి హీరోలతో పలు విజయవంతమైన చిత్రాలు తీసిన వైవీఎస్ చౌదరి, ఇప్పుడు ఈ యంగ్ ఎన్టీఆర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా లాంచింగ్ డేట్‌ను ఖరారు చేశారు. మే 12న అంగరంగ వైభవంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరగనుందని తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వేడుకకు టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని సమాచారం. వైవీఎస్ చౌదరి తన సినిమాలకు సంబంధించిన ప్రతి వేడుకను కూడా సీనియర్ ఎన్టీఆర్ చిత్రాలతో ముడిపెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు మే 12వ తేదీకి సీనియర్ ఎన్టీఆర్ నటించిన 'తోడు నీడ' సినిమా విడుదలై 60 ఏళ్లు పూర్తి కాబోతోంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని, 'తోడు నీడ' షష్టిపూర్తి వేడుకల సందర్భంగా ఈ సినిమా లాంచింగ్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
మొత్తానికి వైవీఎస్ చౌదరి ఈ ఎన్టీఆర్ సినిమాను చాలా ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ను చిత్రబృందం వెల్లడించనుంది. షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి, వచ్చే ఏడాది ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి వైవీఎస్ చౌదరి, ఈ యంగ్ ఎన్టీఆర్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి..