రూ.115 పొంగల్‌కు రూ.273 బిల్లు.. స్విగ్గీపై సీనియర్ నటి సుమలత సీరియస్!

by Ramesh Naini |

ప్రముఖ సీనియర్ నటి, మాజీ ఎంపీ సుమలత అంబరీష్ ‘స్విగ్గీ’ డెలివరీ యాప్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

రూ.115 పొంగల్‌కు రూ.273 బిల్లు.. స్విగ్గీపై సీనియర్ నటి సుమలత సీరియస్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల ఛార్జీలపై సామాన్యులే కాదు, ఇప్పుడు సెలబ్రిటీలు సైతం గళం విప్పుతున్నారు. తాజాగా ప్రముఖ సీనియర్ నటి, మాజీ ఎంపీ సుమలత అంబరీష్ ‘స్విగ్గీ’ (Swiggy) డెలివరీ యాప్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసలు ధర కంటే రెట్టింపు స్థాయిలో బిల్లు వసూలు చేయడంపై ఆమె సోషల్ మీడియా వేదికగా ఫుడ్ డెలివరీ సంస్థను నిలదీశారు.

అసలు కంటే కొసరు ఎక్కువ.. సుమలత ట్వీట్

సుమలత తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ చేస్తూ స్విగ్గీ ఛార్జీల విధానాన్ని ప్రశ్నించారు. ‘గుడ్ మార్నింగ్! నేను స్విగ్గీలో ఒక ఆర్డర్ పెట్టాను. అసలు ధర కంటే వారు రెట్టింపునకు పైగా ఛార్జ్ చేయడాన్ని గమనించాను. ఇలా చేయడం సాధారణమేనా? ఇది అనుమతించదగినదేనా? నైతికమేనా? కేవలం రూ. 115 విలువైన ఐటెమ్‌కు నా వద్ద నుంచి రూ. 273 వసూలు చేశారు!’ అని సుమలత ట్వీట్ చేశారు. ఈ మేరకు తనకు వచ్చిన బిల్లును కూడా ఆమె షేర్ చేశారు. ఆమె ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటెమ్ ‘పొంగల్’ అని తెలుస్తోంది.

పెరిగిన ప్లాట్‌ఫామ్ ఫీజులు..

ఇటీవల కాలంలో ఫుడ్ డెలివరీ యాప్‌ల ఛార్జీలు పెరిగాయి. స్విగ్గీ తన ప్లాట్‌ఫామ్ ఫీజును రూ. 14.99 నుంచి రూ. 17.58 కు పెంచిన విషయం తెలిసిందే. జొమాటో కూడా ఇదే బాటలో నడిచింది. వీటికి అదనంగా 18 శాతం జీఎస్టీ, డెలివరీ ఛార్జీలు, ప్యాకింగ్ ఛార్జీలు కలుపుతుండటంతో.. ఆర్డర్ చేసే ఆహారం బేసిక్ ధర కన్నా దాదాపు 100 శాతం అదనపు భారం వినియోగదారులపై పడుతోందని నెటిజన్‌లు చెబుతున్నారు. సుమలత చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ డెలివరీ యాప్‌ల ఛార్జీల లెక్కలను విశ్లేషిస్తున్నారు. కేవలం వస్తువు ధర మాత్రమే కాదు.. జీఎస్టీ + ప్లాట్‌ఫామ్ ఫీజు + డెలివరీ + డిస్టెన్స్ (దూరం) ఛార్జీలు అదనంగా కలుస్తాయి. ఒకవేళ మీ ‘స్విగ్గీ వన్’ (Swiggy One) సబ్‌స్క్రిప్షన్ గడువు ముగిస్తే డెలివరీ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. పన్నులు, ఫీజుల తర్వాత రూ.115 వస్తువు రూ.250కి పైగా మారడం ఇప్పుడు సర్వసాధారణమేనని ఓ నెటిజన్ కామెంట్ హైలెట్‌గా మారింది.

Next Story