సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

by Malleboina Mahesh |   (  Updated:2025-11-24 10:22:19  IST  )

బాలీవుడ్‌ సీనియర్ నటుడు ధర్మేంద్ర (89) చివరి శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు మధ్యాహ్నం కన్నుమూసినట్లు తెలుస్తుంది.

సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్‌ సీనియర్ నటుడు ధర్మేంద్ర (89) చివరి శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు మధ్యాహ్నం కన్నుమూసినట్లు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితమే మరణించినట్లు వార్తలు రాగా.. అప్పుడు ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న ధర్మేంద్ర శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయినప్పటికీ ఆయన పరిస్థితి నిలకడగా ఉందని కుమార్తె ఎషా డియోల్ ప్రకటించారు. అనంతరం ఆయన కోలుకున్న తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కాగా నిన్న రాత్రి నుంచి ఆయన పరిస్థితి విషమించడంతో కటుంబ సభ్యులు, బందుమిత్రులు పెద్ద ఎత్తున ధర్మేంద్ర నివాసానికి చేరుకున్నట్లు తెలుస్తుంది.

1935 డిసెంబర్ 8న పంజాబ్‌లో జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. 1960లో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన బాలీవుడ్‌తో పాటు అనేక భాషల్లో 300 లకు పైగా సినిమాల్లో నటించారు. షోలే సినిమాతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆయన బాలీవుడ్‌ హీమ్యాన్‌గా గుర్తింపు పొందారు. 2004లో రాజస్థాన్‌ బికనీర్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అలాగే ఆయన నటనకు 2012లో ధర్మేంద్రకు పద్మభూషణ్‌, 1997లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు దక్కాయి. ధర్మేంద్ర మృతికి సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఆయన మృతిపై కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేయకముందే దర్శకుడు కరణ్ జోహార్ ధర్మేంద్ర మరణాన్ని ధృవీకరిస్తూ భావోద్వేగంతో కూడిన సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. “ఇది ఒక యుగానికి ముగింపు. ధర్మేంద్ర ఒక మెగాస్టార్, అందం, అభిరుచి, హీరోయిజానికి రూపం. అద్భుతమైన మనిషి, పరిశ్రమలో అందరికీ అత్యంత ప్రియుడు. ఆయన స్థానం ఎవరూ భర్తీ చేయలేరు,” అని ఆయన పేర్కొన్నారు.

Read More... ఇండస్ట్రీలో ఆయన రారాజు: CM రేవంత్

Next Story