సల్మాన్ మాజీ ప్రేయసి ఫామ్ హౌస్ లో దొంగతనం

by Bhanu |

సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు, ప్రముఖ బాలీవుడ్ నటి సంగీత బిజ్లానీకి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

సల్మాన్ మాజీ ప్రేయసి ఫామ్ హౌస్ లో దొంగతనం
X

దిశ, వెబ్ డెస్క్ : సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు, ప్రముఖ బాలీవుడ్ నటి సంగీత బిజ్లానీకి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. పుణెలోని మావల్ ప్రాంతంలో గల ఆమె ఫామ్‌హౌస్‌లో దొంగతనం జరిగింది. ఫామ్‌హౌస్ పరిస్థితి చూసి సంగీత బిజ్లానీ షాక్ అయ్యారు. దొంగలు ఆ ఫామ్‌హౌస్‌లో పెద్ద ఎత్తున ధ్వంసం చేశారు.

సుమారు 4 నెలల తర్వాత తన తికోనా గ్రామంలో ఉన్న ఫామ్‌హౌస్‌కు సంగీత బిజ్లానీ వెళ్ళగా, అక్కడి దృశ్యం చూసి ఆమె నివ్వెరపోయారు. ఫామ్‌హౌస్ ప్రధాన ద్వారం విరిగి ఉండటమే కాక, లోపల కూడా విధ్వంసం జరిగింది. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించారు.




పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు మొదలుపెట్టారు. చాలా నెలల తర్వాత నటి తన ఫామ్‌హౌస్‌కు చేరుకున్నప్పుడు ఈ సంఘటన బయటపడింది. పుణె రూరల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, నటి సంగీత బిజ్లానీ ఇలా తెలిపారు: “ఫామ్‌హౌస్ ప్రధాన గేటు, కిటికీ గ్రిల్ విరిగిపోయాయి. ఒక టీవీ సెట్ కనిపించకుండా పోయింది. పడకలు, రిఫ్రిజిరేటర్‌తో సహా పలు గృహోపకరణాలు, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు.”

సందీప్ సింగ్ గిల్ (పుణె రూరల్ ఎస్పీ)కి ఇచ్చిన ఫిర్యాదులో సంగీత ఇలా వివరించారు: “మా నాన్నగారి ఆరోగ్య సమస్యల వల్ల నేను ఫామ్‌హౌస్‌కు వెళ్ళలేకపోయాను. ఈరోజు నా ఇద్దరు హౌస్‌హెల్ప్‌లతో ఫామ్‌హౌస్‌కు వెళ్ళాను. అక్కడికి చేరుకోగానే మెయిన్ గేటు పగలగొట్టి ఉండటం చూసి షాకయ్యాను. లోపలికి వెళ్ళగా, కిటికీ గ్రిల్ విరిగి ఉంది. ఒక టీవీ సెట్ పోయింది, మరొకటి పగిలి ఉంది.”

ఇంకా, తన ఫిర్యాదులో దొంగలు పై అంతస్తులో చాలా విధ్వంసం సృష్టించారని ఆమె పేర్కొన్నారు. అన్ని పడకలు విరిగిపోయాయి. అనేక గృహోపకరణాలు, విలువైన వస్తువులు దొంగిలించబడ్డాయి. సీసీటీవీ ఫుటేజీలో దొంగలు కేవలం దోచుకోవడమే కాక, భారీగా విధ్వంసం సృష్టించినట్టు కనిపిస్తోంది. పోలీసులు ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు.


Next Story