Sai Rajesh: ఆ సమయంలో జబర్దస్త్ బ్యాచ్ మొత్తం నన్ను ముంచేసింది

by Pulgam srinivas |

హృదయ కాలేయం ఆడియో ఫంక్షన్‌కు జబర్దస్త్ బ్యాచ్ హ్యాండ్ ఇచ్చారని సాయి రాజేష్ చెప్పారు.

Sai Rajesh: ఆ సమయంలో జబర్దస్త్ బ్యాచ్ మొత్తం నన్ను ముంచేసింది
X

దిశ, వెబ్ డెస్క్: టాలెంటెడ్ దర్శకుడు, నిర్మాత సాయి రాజేష్ తాజాగా విడుదలైన 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రేక్షకాదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో సాయి రాజేష్‌కు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో తన తొలి చిత్రం 'హృదయ కాలేయం' విడుదలకు ముందు ఎదుర్కొన్న కష్టాలను ఆయన గుర్తుచేసుకున్నారు. సాయి రాజేష్ మాట్లాడుతూ... హృదయ కాలేయం సినిమా కోసం నా దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేశాను. తర్వాత మ్యూజిక్ హక్కులు అమ్మగా నాకు ఒకటిన్నర లక్ష రూపాయలు వచ్చాయి.

ఆ డబ్బుతో ఆడియో ఫంక్షన్ నిర్వహిస్తే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుందని భావించాను. అందుకే ఓ ఈవెంట్ సంస్థను సంప్రదించి నా వద్ద ఉన్న బడ్జెట్ గురించి చెప్పి ఆడియో ఫంక్షన్ నిర్వహించాలని కోరాను. నాకు తెలిసిన చాలామంది, సంపూర్ణేష్ బాబుకు పరిచయమైన వారు, అలాగే జబర్దస్త్ టీమ్ మొత్తం ఆడియో ఫంక్షన్‌కు వస్తారని నమ్మకం ఉండేది. వాళ్లు వస్తే ఈవెంట్ పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాను. కానీ ఫంక్షన్ సమయం దగ్గరపడే కొద్దీ జబర్దస్త్ బ్యాచ్‌లో ఎవరూ నా ఫోన్ కాల్స్‌కు స్పందించలేదు. నేను ఆశించిన వారిలో చాలామంది కూడా చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారు. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదని తెలిపారు. చివరికి ఏదైతే అది అవుతుందని భావించి సంపూర్ణేష్ బాబు కోసం ఒక స్పీచ్ సిద్ధం చేశాను. ఇది మాట్లాడితే సరిపోతుందని చెప్పాను.

అయితే ఫంక్షన్‌కు కొద్దిసేపటి ముందు ఆయన నేను మాట్లాడను అన్నారు. అది విని నేను షాక్ అయ్యాను. నువ్వు మాట్లాడకపోతే మన ఇద్దరి కెరీర్‌కు ఇబ్బంది వస్తుంది.. నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాను. ఆ తర్వాత ఏమనుకున్నారో తెలియదు కానీ, నేను రాసిన స్పీచ్‌కు తనదైన శైలిలో మరికొన్ని అంశాలు జోడించి వేదికపై మాట్లాడారు. ఆయన ప్రసంగాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. అలా ఆడియో ఫంక్షన్ పెద్ద హిట్ కావడంతో సినిమాకు కూడా మంచి ప్రచారం దక్కిందని సాయి రాజేష్ చెప్పుకొచ్చారు. ఇలా 'హృదయ కాలేయం' సినిమా విడుదలకు ముందు తాను ఎదుర్కొన్న ఒత్తిడి, నిరాశ, చివరకు ఆడియో ఫంక్షన్ విజయవంతం కావడం వెనుక జరిగిన ఆసక్తికర సంఘటనలను సాయి రాజేష్ ఈ ఇంటర్వ్యూలో వివరించారు.

Next Story