వివాదాస్పద సినిమా ‘సట్లుజ్’ పై ప్రశంసలు కురిపించిన ఆర్జీవీ.. షాకింగ్ పోస్ట్ వైరల్

by Mallepaka Hamsa |

ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, మన చరిత్రలోని అత్యంత చీకటి రోజులను గుర్తుచేస్తూ ఎన్నటికీ మానని ఒక లోతైన గాయం లాంటిదని ఆయన చెప్పారు.

వివాదాస్పద సినిమా ‘సట్లుజ్’ పై ప్రశంసలు కురిపించిన ఆర్జీవీ.. షాకింగ్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు దిల్జీత్ దోసాంజ్, హనీ టెహ్రన్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘సట్లుజ్’. పంజాబ్‌లోని మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన నాలుగేళ్లకు ఓటీటీలో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలోకి వచ్చిన రెండురోజులకే వివాదం తలెత్తడంతో జీ5నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఐటీరూల్స్ ఉల్లంఘనలు, భద్రతా కారణాలను ఉటంకిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయాన్ని తాను ముందుగానే ఊహించానని దిల్జీత్ దోసాంజ్ పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా సినిమాను ఎంతోమంది ప్రేక్షకులు డౌన్‌లోడ్ చేసుకున్నారని.. దానిని చూడకుండా ఎవరూ ఆపలేరని అన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ విషయంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, మన చరిత్రలోని అత్యంత చీకటి రోజులను గుర్తుచేస్తూ ఎన్నటికీ మానని ఒక లోతైన గాయం లాంటిదని ఆయన చెప్పారు. సినిమాలో దిల్జీత్ దోసాంజ్ ఎలాంటి ఆర్భాటాలు, అనవసరపు హీరోయిజం చూపించకుండా, కేవలం తన మనస్సాక్షిని, నిజాయితీని ఆయుధాలుగా చేసుకుని లోపల ఉన్న కోపాన్ని కళ్లతోనే చూపిస్తూ అద్భుతంగా నటించాడని ప్రశంసించారు. అలాగే నటుడు అర్జున్ రాంపాల్ కూడా వ్యవస్థలో ఉన్న కుళ్లును, మోసాలను ఒళ్లు గగుర్పొడిచేలా వాస్తవికంగా చూపించాడని మెచ్చుకున్నారు.

దర్శకుడు హనీ ట్రెహన్ ఈ కథలోని భయంకరమైన నిజాలను ఎక్కడా మసాలా జోడించకుండా, ప్రభుత్వ ఫైళ్లు, దహన సంస్కారాల రికార్డులు, రహస్య సంభాషణల ద్వారా ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లా నెమ్మదిగా, బలంగా చూపించాడని వర్మ ప్రశంసించారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో తన సొంత ప్రజలనే ఎలా ఇబ్బంది పెడతారు, ఆపై దానికి సంబంధించిన సాక్ష్యాలను చెరిపివేయడానికి ఎలా ప్రయత్నిస్తారనే పెద్ద విషయాన్ని ఎక్కడా పెద్ద పెద్ద నీతిబోధలు, ఉపన్యాసాలు లేకుండా చూపించడం మామూలు విషయం కాదని అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్నవారిని, బలం ఉన్నవారిని ఇబ్బంది పెట్టే ఏ కళ అయినా తన పనిని విజయవంతంగా పూర్తి చేసినట్లేనని.. ప్రస్తుతం ఈ సినిమాను ఆపడానికి జరుగుతున్న ప్రయత్నాలే దీనికి నిదర్శనమని ఆర్జీవీ పేర్కొన్నారు. ఈ రోజుల్లో సినిమాలు కేవలం కాలక్షేపం కోసం వస్తుంటే, ఒక నిజాయితీ గల కథ ఎంతటి పవర్‌ఫుల్‌గా ఉంటుందో ఈ చిత్రం గుర్తుచేసిందన్నారు. 'సట్లజ్' చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి చర్చించాలని కోరిన వర్మ, ఇందులో బాధితులకు జరిగినట్లుగా ఈ సినిమాకు కూడా ముగింపు ఇవ్వవద్దని, జస్వంత్ సింగ్ ఖల్రాకు చేసిన అన్యాయాన్ని ‘సట్లుజ్’కు చేయవద్దని అధికార వర్గాలకు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే సత్యాన్ని ఎంత దాచాలని చూస్తే, అది అంతకంటే గట్టిగా బయటకు వస్తుందని ఆర్జీవీ రాసుకొచ్చారు.

Next Story