8 వ‌సంతాలులో ఆ సీన్‌పై విలేక‌రి ఫైర్.. నేరం చేసేవారికి కులం, మ‌తం ఉండ‌దంటూ ద‌ర్శ‌కుడు సెన్సేషనల్ ట్వీట్..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-24 06:15:58  IST  )

‘మ్యాడ్’ ఫేమ్ అనంతిక సనిల్‌కుమార్(Ananthika Sanilkumar), రవితేజ దుగ్గిరాల(Raviteja Duggirala), హను రెడ్డి(Hanu Reddy), కన్నా పసునూరి(Kanna Pasunoori) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘8 వ‌సంతాలు’(8 Vasanthalu).

8 వ‌సంతాలులో ఆ సీన్‌పై విలేక‌రి ఫైర్.. నేరం చేసేవారికి కులం, మ‌తం ఉండ‌దంటూ ద‌ర్శ‌కుడు సెన్సేషనల్ ట్వీట్..
X

దిశ, వెబ్‌డెస్క్: ‘మ్యాడ్’ ఫేమ్ అనంతిక సనిల్‌కుమార్(Ananthika Sanilkumar), రవితేజ దుగ్గిరాల(Raviteja Duggirala), హను రెడ్డి(Hanu Reddy), కన్నా పసునూరి(Kanna Pasunoori) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘8 వ‌సంతాలు’(8 Vasanthalu). ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి(Phaneendra Narsetty) దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. ఇక ఈ మూవీ జూన్ 20న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలై మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంటున్నది. అయితే ఈ నేప‌థ్యంలో ఈ మూవీటీమ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా.. ఈ సినిమాలోని వారణాసి ఎపిసోడ్ పై ఓ విలేక‌రి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సీన్‌లో కబేళాలపై పండితులు, ముస్లింలు కలిపి రేప్ చేసినట్టుగా చూపించారని మండిపడ్డారు.

కేవలం పండితులు, బ్రాహ్మణులను టార్గెట్ చేస్తూ ఆ సన్నివేశాన్ని చిత్రీకరించినట్టుగా అనిపిస్తోందని అన్నారు. ప్రత్యేకించి ఒక వర్గాన్ని ప్రస్తావిస్తూ అడిగిన తీరుపై దర్శకుడు ఫణీంద్ర ఎక్స్ వేదికగా తన వ‌ర్షెన్‌ తెలియజేశారు. కాశీ లాంటి పవిత్ర క్షేత్రంలో ఫైట్ సీక్వెన్స్, రేప్ సీక్వెన్స్ తీయడానికి కబేళా కావాల్సి వచ్చిందా? రేప్ చేసే విలన్‌గా బ్రాహ్మిణ్ కావాల్సి వచ్చిందా అంటూ మీడియా ప్ర‌తినిధి ప్ర‌శ్నించ‌డంతో ద‌ర్శ‌కుడు ఫణీంద్ర వివరణ ఇచ్చారు. బ్రాహ్మణ వర్గం పట్ల నాకెప్పుడూ అమితమైన గౌరవం ఉంది. వారి నాలుకపై సరస్వతి దేవి ఎప్పుడూ కొలువై ఉంటుంది. అయితే ఒక వర్గంపైనే ముద్ర వేస్తూ అత్యాచారం గురించి విలేకరులు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో నాకు అర్థం కాలేదు అని అన్నారు.

నేరం చేసేవారికి కులం, మ‌తం ఉండ‌దు. వారి విచ‌క్ష‌ణ‌, స్వ‌భావం కార‌ణంగానే చేస్తారు. నేను ఏ ఒక్క వర్గాన్ని వేలెత్తి చూపే ప్రయత్నం చేయలేదు, కబేళా అనేది ఎక్కడైనా ఉండొచ్చని, దానికి అనుగుణంగానే పాత్రలను ఎంచుకున్నానని తెలిపారు. రావణుడిని కూడా ఉదాహరణగా చూపించి.. రావణుడు ఎవరు? ఆయన ఒక బ్రాహ్మణుడి కుమారుడు క‌దా. గొప్ప శివభక్తుడు. నుదుటిపై విభూతి ధారణ చేస్తాడు. మెడలో రుద్రాక్షలు వేస్తాడు. ఉన్నత వర్గం నుంచి వచ్చిన ఆయ‌న వేదాలు, పురాణ గ్రంథాలను ఔపాస‌న‌ పట్టి చివరకు ఏం చేశాడు?” అని ప్రశ్నించారు.

మనిషి తన ప్రవర్తన, ఆలోచనా ధోరణి వల్లే నేరం చేస్తాడని, అంతేకానీ మతం, కులం కారణం కాదని, ఇది మ‌నిషి నైజం అంటూ చెప్పుకొచ్చారు. యద్భావం తద్భవతి. మీరు ఏం చూస్తారో అదే కనపడుతుంది. మీ దృష్టికోణాన్ని మార్చుకోండి. దయ చేసి అనవసర విషయాలను ఇందులోకి తీసుకురాకండి. న‌టి పంతులు అనే ప‌దాన్ని అన‌కుండా ఉండాల్సింది. దీనిని విలేక‌రి స‌రిదిద్ధ‌డంలో త‌ప్పు లేదు. ఈ విష‌యాన్ని ఇక్క‌డితో వ‌దిలేస్తే మంచిది అని ఫ‌ణీంద్ర త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మాారగా.. సినిమాను సినిమాలాగే చూడాలి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Link

Next Story