సూపర్ ఎగ్జైటెడ్ అంటూ కొత్త సినిమా ప్రకటించిన రేణు దేశాయ్.. ఇదంతా నా మహదేవుని ఆశీర్వాదమే అంటూ పోస్ట్

by Mallepaka Hamsa |

యమునా కిషోర్ దర్శకత్వంలో పని చేయడం, అలాగే అద్భుతమైన నటుడైన సంకర్ ఇందుచూదన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకు సూపర్ ఎగ్జైటింగ్‌గా ఉందని చెప్పారు.

సూపర్ ఎగ్జైటెడ్ అంటూ కొత్త సినిమా ప్రకటించిన రేణు దేశాయ్.. ఇదంతా నా మహదేవుని ఆశీర్వాదమే అంటూ పోస్ట్
X

దిశ, సినిమా: ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ బిజీగా మారిపోయారు. గత ఏడాది ‘బ్యాడ్ గర్ల్స్’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన ఆమె, సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు. తన వ్యక్తిగత విషయాలతో పాటు కొత్త సినిమాలకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. తాజాగా, ఆమె తన తదుపరి సరికొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అడ్వర్టైజింగ్ రంగంలో రాక్‌స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యమునా కిషోర్ ఈ సినిమా ద్వారా తొలిసారిగా దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

సంకర్ ఇందుచూదన్ హీరోగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రేణు దేశాయ్ ఒక అత్యంత కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీలో శరవేగంగా జరుగుతోంది. ఈ విషయాన్ని రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. యమునా కిషోర్ దర్శకత్వంలో పని చేయడం, అలాగే అద్భుతమైన నటుడైన సంకర్ ఇందుచూదన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకు సూపర్ ఎగ్జైటింగ్‌గా ఉందని చెప్పారు. వీటన్నింటికీ మించి మహాదేవుని నగరమైన కాశీలో ఈ చిత్ర షూటింగ్ జరుపుకోవడం నిజంగా ఆ పరమశివుని ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు ఆమె రాసుకొచ్చారు. అయితే ఈ సినిమా కథేంటి, టైటిల్ ఏంటి అనే పూర్తి వివరాలను మాత్రం ఆమె ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచారు.

Next Story