- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RGUKT బీటెక్ ప్రవేశాల ఫలితాలు విడుదల
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్-ఆంధ్రప్రదేశ్ (ఆర్జీయూకేటీ-ఏపీ) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరు సంవత్సరాల సమగ్ర బీటెక్ కోర్సుల ప్రవేశాల కోసం తాత్కాలిక ఎంపిక జాబితాను మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా శనివారం విడుదల చేశారు. ..

దిశ, ఏపీ బ్యూరో: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్-ఆంధ్రప్రదేశ్ (ఆర్జీయూకేటీ-ఏపీ) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరు సంవత్సరాల సమగ్ర బీటెక్ కోర్సుల ప్రవేశాల కోసం తాత్కాలిక ఎంపిక జాబితాను మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా శనివారం విడుదల చేశారు. మొత్తం 4,040 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ ఏడాది ప్రవేశాల కోసం మొత్తం 44,104 దరఖాస్తులు అందగా వాటిలో 25,406 దరఖాస్తులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నుంచి, 17,798 ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల నుంచి, మరో 900 దరఖాస్తులు ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల నుంచి వచ్చినట్లు వెల్లడించారు.
సాధారణ కేటగిరీలోని 3,640 సీట్లతో పాటు ఈడబ్ల్యూఎస్ కోటాలోని 400 సీట్లు కలిపి మొత్తం 4,040 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక కేటగిరీల ఫలితాలను విడిగా ప్రకటించనున్నట్లు తెలిపారు.,ఎంపికైన విద్యార్థుల్లో 3,907 మంది (96.7 శాతం) ప్రభుత్వ పాఠశాలలకు చెందినవారు కావడం విశేషం. ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 133 మంది (3.3 శాతం) మాత్రమే ఎంపికయ్యారు. గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలల ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రాధాన్యత కల్పించాలనే యూనివర్సిటీ లక్ష్యాన్ని ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.
లింగ ప్రాతిపదికన చూస్తే ఎంపికైన వారిలో 2,855 మంది బాలికలు (70.66 శాతం), 1,185 మంది బాలురు (29.33 శాతం) ఉన్నారు. బాలికల ఎంపిక శాతం గణనీయంగా ఉండటం ప్రోత్సాహకర పరిణామమని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఎంపిక జాబితాలో బాపట్ల జిల్లా కొల్లూరు జెడ్పీ హైస్కూల్ ఫర్ గర్ల్స్‌కు చెందిన బయ్యిరెడ్డి దివ్య తేజ శ్రీ 596 మార్కులతో తొలి ర్యాంకు సాధించారు. పలువురు విద్యార్థులు 595, 594 మార్కులు సాధించడం ప్రవేశాల్లో తీవ్ర పోటీ నెలకొంది.
క్యాంపస్‌ల వారీగా కౌన్సెలింగ్ షెడ్యూల్
నూజివీడు, ఆర్‌కే వ్యాలీ క్యాంపస్‌లలో జూన్ 19, 20 తేదీల్లో, ఒంగోలు క్యాంపస్‌కు సంబంధించిన కౌన్సెలింగ్ జూన్ 22, 23 తేదీల్లో ఆర్‌కే వ్యాలీలో, శ్రీకాకుళం క్యాంపస్‌లో జూన్ 23, 24 తేదీల్లో నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థుల ప్రవేశాలు ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఖరారు కానున్నాయని అధికారులు స్పష్టం చేశారు. నిర్ణీత తేదీల్లో సంబంధిత కౌన్సెలింగ్ కేంద్రాలకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. కాగా ఎంపికైన విద్యార్థులను రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి మరియు ఆర్జీయూకేటీ-ఏపీ ఛాన్సలర్ నారా లోకేశ్, ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.మధు మూర్తి, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం.ఎల్.ఎన్.రావు అభినందించారు. జూలై 1, 2026 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.






