రాణి ముఖర్జీకి అరుదైన గౌరవం.. ఇది నా అదృష్టంగా భావిస్తున్నానంటూ ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

ప్రపంచ వేదికపై భారతీయ సినిమాను నిరంతరం గౌరవిస్తూ వస్తున్న 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్' (IFFM) వేడుకల్లో ఈ పురస్కారాన్ని అందుకోవడం మరింత ప్రత్యేకంగా అనిపిస్తోందని అన్నారు.

రాణి ముఖర్జీకి అరుదైన గౌరవం.. ఇది నా అదృష్టంగా భావిస్తున్నానంటూ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటి రాణి ముఖర్జీకి ఒక అరుదైన గౌరవం దక్కింది. మెల్‌బోర్న్ వేదికగా జరగనున్న ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్’ (IFFM) వేడుకల్లో భాగంగా.. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ 'లా ట్రోబ్ యూనివర్సిటీ' ఆమెకు ప్రతిష్టాత్మకమైన గౌరవ డాక్టరేట్ అందించనుంది. భారతీయ సినిమాకు ఆమె చేసిన అద్భుతమైన సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని ప్రకటిస్తున్నారు. ఆగస్ట్ 14న మెల్‌బోర్న్‌లోని ఫెడరేషన్ స్క్వేర్‌లో ఈ డిగ్రీని అందజేయనున్నట్లు సమాచారం. తాజాగా, ఈ విషయంపై రాణి ముఖర్జీ సంతోషం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. లా ట్రోబ్ యూనివర్సిటీ నుండి ఈ గౌరవ డాక్టరేట్ అందుకోవడం తనకు ఎంతో గర్వంగా ఉందని రాణి ముఖర్జీ చెప్పారు. తన జీవిత ప్రయాణంలో సినిమానే తనకు అతిపెద్ద గురువని, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి, ప్రజల్లో సానుభూతిని నింపడానికి కథలకి ఎంతో శక్తి ఉందని తాను ఎప్పుడూ నమ్ముతానని ఆమె తెలిపారు.

ప్రపంచ వేదికపై భారతీయ సినిమాను నిరంతరం గౌరవిస్తూ వస్తున్న 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్' (IFFM) వేడుకల్లో ఈ పురస్కారాన్ని అందుకోవడం మరింత ప్రత్యేకంగా అనిపిస్తోందని అన్నారు. ఇంతటి గొప్ప గుర్తింపు ఇచ్చినందుకు లా ట్రోబ్ యూనివర్సిటీ, IFFM సంస్థలకి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. కష్టాలను ఎదురించి నిలబడే మనుషుల పట్టుదల, ధైర్యం, జీవిత పోరాటాల కథలను చెప్పే ఎన్నో స్ఫూర్తిదాయకమైన సినిమాల్లో నటించే భాగ్యం తనకు కలగడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మానవీయ కోణంలో సాగే కథలు తనను ఎప్పుడూ కదిలిస్తాయని, సినిమా వల్ల తాను ఎన్నో జీవితాలను జీవించగలిగానని అన్నారు. ఈ అరుదైన గౌరవాన్ని తన మాతృభూమి భారతదేశానికి, అలాగే నటిగా ఎదగడానికి తనపై ఎనలేని ప్రేమను కురిపించిన ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రాణి ముఖర్జీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Next Story