రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.. పరిస్థితులే నన్ను ఈ స్థాయికి తెచ్చాయంటూ సంచలన పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-06-12 05:12:48  IST  )

నేను ఎప్పుడూ నిజాయితీగా, నా బాధ్యతను సక్రమంగా నిర్వహించాలనే అనుకున్నాను. కానీ, ఒకరోజు నేను రాజకీయాల్లోకి వస్తానని కలలో కూడా ఊహించలేదు

రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.. పరిస్థితులే నన్ను ఈ స్థాయికి తెచ్చాయంటూ సంచలన పోస్ట్
X

దిశ, సినిమా: తమిళనాడు రాజకీయాల్లో రోజుకో కొత్త మార్పు చోటుచేసుకుంటోంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాజీనాయా చేసిన తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ ప్రతిష్టాత్మక స్థానంలో విజయ్ TVK పార్టీ తరపున నటుడు రాఘవ లారెన్స్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోందిరాఘవ లారెన్స్ తన పోస్ట్‌లో స్పందిస్తూ.. "నేను ఎప్పుడూ నిజాయితీగా, నా బాధ్యతను సక్రమంగా నిర్వహించాలనే అనుకున్నాను. కానీ, ఒకరోజు నేను రాజకీయాల్లోకి వస్తానని కలలో కూడా ఊహించలేదు. నాకు రాజకీయాల్లోకి రావాలనే కోరిక గానీ, రాజకీయం ద్వారా డబ్బు సంపాదించాలనే ఆశ గానీ, ఏదైనా పెద్ద పదవిని దక్కించుకోవాలనే లాలస గానీ ఎప్పుడూ లేదు.

నేను నమ్మిన వ్యక్తి, నాకు అత్యంత సన్నిహితుడైన ఒకరు రాజకీయాల్లోకి వస్తే.. వారికి మద్దతుగా నిలిచి, నేను వ్యక్తిగతంగా చేస్తున్న సేవా కార్యక్రమాల కంటే పెద్ద ఎత్తున ప్రజలకు సేవ చేయాలని మాత్రమే అనుకున్నాను. కానీ, నేటి పరిస్థితులు నన్ను రాజకీయాల్లోకి అడుగుపెట్టేలా చేశాయి" అని పేర్కొన్నారు. రాజకీయాలపై తన మనసులోని మాటను పంచుకుంటూ.. " రాజకీయంపై నా అభిప్రాయం ఏంటి? అది నా జీవితంలోకి ఎలా వచ్చింది? రాజకీయాలపై నా తల్లి ఆలోచనలు ఏంటి? అలాగే నా ప్రయాణాన్ని మార్చిన కొన్ని ముఖ్యమైన, ఆసక్తికరమైన సంఘటనలు ఏంటనే విషయాలను ఎలాంటి దాపరికం లేకుండా, పూర్తి నిజాయితీతో వీడియోలో పంచుకున్నాను" అని లారెన్స్ వెల్లడించారు. తన రాజకీయ ప్రయాణంపై అభిమానులకు, ప్రజలకు లారెన్స్ ఒక కీలకమైన విజ్ఞప్తి చేశారు.

ఎటువంటి స్వార్థం, ప్రతిఫలం ఆశించకుండా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించాలని ఆయన కోరారు. తన వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన సలహాలను, మార్గదర్శకత్వాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయాలని అన్నారు. ఒకవేళ ప్రజలు వద్దని చెబితే, తాను ఎంత మాత్రం రాజకీయాల్లోకి ప్రవేశించనని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటూనే సమాజానికి తాను చేస్తున్న నిస్వార్థ సేవలను ఎప్పటిలాగే కొనసాగిస్తానని చెప్పారు. అలా కాకుండా ప్రజలంతా రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటే మాత్రం.. అందరి ఆశీస్సులతో, తాను అనుకున్న వ్యక్తులతో కలిసి ఈ సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నానని లారెన్స్ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఈ ప్రకటనతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.
link

Next Story