ప్రభాస్‌ను రోడ్డుపై పరిగెత్తమంటే సిగ్గుపడ్డాడు.. 'ఈశ్వర్' మూవీ సీక్రెట్స్ రివీల్ చేసిన ఆర్ట్ డైరెక్టర్

by Pulgam srinivas |

'ఈశ్వర్' సమయంలోనే ప్రభాస్ భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతాడని తనకు అనిపించిందని ఆర్ట్ డైరెక్టర్ కృష్ణ మాయ వెల్లడించారు.

ప్రభాస్‌ను రోడ్డుపై పరిగెత్తమంటే సిగ్గుపడ్డాడు.. ఈశ్వర్ మూవీ సీక్రెట్స్ రివీల్ చేసిన ఆర్ట్ డైరెక్టర్
X

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ 'ఈశ్వర్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రారంభానికి ముందు జరిగిన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను ఆర్ట్ డైరెక్టర్ కృష్ణ మాయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కృష్ణ మాయ మాట్లాడుతూ... 'ఈశ్వర్' సినిమా కోసం మొదట కొంతమంది హీరోలను పరిశీలించామని, చివరకు ప్రభాస్‌ను ఎంపిక చేశామని తెలిపారు. ఒకరోజు తాను ఆఫీస్‌లో ఉండగా, ఆరడుగుల ఎత్తున్న ఓ యువకుడు కొంచెం వంగి నడుచుకుంటూ లోపలికి వచ్చాడని, అతనే కృష్ణంరాజు గారి అబ్బాయి ప్రభాస్ అని తర్వాత తెలిసిందన్నారు.

కొద్దిసేపు ఆయనతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానని చెప్పారు. ఆ తర్వాత నిర్మాతలు, సినిమాకు సంబంధించిన వారు కెమెరామెన్ జవహర్ రెడ్డితో కలిసి ప్రభాస్ నటనను పరీక్షించేందుకు కొన్ని షాట్లు చిత్రీకరించాలని తమను పంపినట్లు తెలిపారు. బయటకు వెళ్లిన తర్వాత జవహర్ రెడ్డి కెమెరా పట్టగా, తాను దర్శకుడిగా ప్రభాస్‌కు సూచనలు ఇచ్చానన్నారు. మొదట ప్రభాస్‌ను అందరి మధ్య పరిగెత్తుకుంటూ రావాలని చెప్పగా, "ఇంతమంది మధ్య అలా పరిగెడితే పిచ్చివాడిని అనుకుంటారు" అంటూ ఆయన కొంచెం సంకోచించారని చెప్పారు. దానికి తాను, "తర్వాత వందల, వేల మంది ముందు నటించాల్సి ఉంటుంది.

అలాంటి సంకోచం ఉండకూడదు" అని చెప్పడంతో ప్రభాస్ పరిగెత్తుకుంటూ వచ్చారని తెలిపారు. ఆ తర్వాత తనను ఓ అమ్మాయిగా ఊహించుకుని "ఐ లవ్ యూ" చెప్పాలని అడిగితే, మొదట సిగ్గుపడినా చివరకు ఆ సన్నివేశాన్ని కూడా బాగా చేశారని చెప్పారు. ఆ క్షణంలోనే ప్రభాస్ భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతాడని తనకు అనిపించిందని వెల్లడించారు. అంతేకాకుండా, వెంటనే నిర్మాతతో "ప్రభాస్‌తో ఐదారు సినిమాలకు ఒప్పందం చేసుకోండి" అని చెప్పానని, కానీ వారు అలా చేయలేదని తెలిపారు. చేసి ఉంటే ఆ నిర్మాత కూడా స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగేవారని కృష్ణ మాయ పేర్కొన్నారు.

Next Story