ప్రేమించే గోత్రం.. సేవ చేసే నక్షత్రం.. ప్రీ రిలీజ్ వేడుకలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్

by Chukka Sudharani |

'గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'.

ప్రేమించే గోత్రం.. సేవ చేసే నక్షత్రం.. ప్రీ రిలీజ్ వేడుకలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్
X

దిశ, సినిమా: 'గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 19న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర బృందం తాజాగా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన అభిమానులకు, లైవ్‌లో వేడుకను వీక్షిస్తున్న ప్రజలకు నమస్కారాలు. సినిమా నాకు చాలా ఇష్టమైనవి. నాకు అన్నం పెట్టింది సినిమా. ఈరోజు ప్రజలకు సేవ చేసే గుర్తింపు ఇచ్చింది సినిమా. అందుకే నా నిర్మాతలు బాగుండాలని కోరుకుంటాను. సినిమా కోసం ఉత్సాహంగా వచ్చే నా అభిమానులకు ఆనందం కలగాలని కోరుకుంటాను. సినిమా ఎంత వసూలు చేసింది అని నేను ఎప్పుడూ పట్టించుకోను. సినిమా బాగుండాలని కోరుకుంటాను.

తెలుగు సినిమా, తమిళ సినిమా అని చూడను.. భారతీయ సినిమా అనుకుంటాను నేను. మన తెలుగు చిత్ర పరిశ్రమ ఆస్కార్ స్థాయికి చేరుకోవడం గొప్ప ఘనత. ఇలాంటి పరిశ్రమలో భాగం కావడం నాకు ఆనందంగా ఉంటుంది. సినిమా విజయం సాధించాలనే అందరం కలిసి పని చేస్తాం. ఈ ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటాం. వాటిని తట్టుకొని సినిమా పూర్తి చేయడం చాలా కష్టమైనది. నాకున్న బాధ్యతలు, విధులకు ఇబ్బంది కలగకుండా.. చాలా తక్కువ సమయంలోనే ఈ సినిమాను పూర్తి చేశాము. నాతో సహా చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. మార్చి 19 ఉగాది రోజున ఈ సినిమాను మీకు చూపించడం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. సినిమాను మన జీవితంలోనుంచి తీసేయలేము. మన అందరికీ ఉన్న గొప్ప వినోదం సినిమా. ఉస్తాద్ భగత్ సింగ్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నాది మిమ్మల్ని ప్రేమించే గోత్రం, సేవ చేసే నక్షత్రం. ఈ వేడుక జరుపుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్‌కి కృతఙ్ఞతలు. అందరికీ ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు’ అన్నారు.

Next Story