పాన్‌ మసాలా యాడ్‌ కేసు.. నటుడు సల్మాన్‌ ఖాన్‌కు బిగ్ రిలీఫ్

by Kema Shiva Kumar |

పాన్ మసాలా తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు జాతీయ వినియోగదారుల కమిషన్ (NCDRC)లో భారీ ఊరట లభించింది.

పాన్‌ మసాలా యాడ్‌ కేసు.. నటుడు సల్మాన్‌ ఖాన్‌కు బిగ్ రిలీఫ్
X

దిశ, వెబ్‌‌డెస్క్: బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్‌ (Salman Khan)కు బిగ్ రిలీఫ్ లభించింది. ఓ పాన్ మసాలా బ్రాండ్‌కు సంబంధించిన తప్పుదోవ పట్టించే ప్రకటన కేసులో ఆయనపై దిగువ కోర్టులో సాగుతున్న విచారణ ప్రక్రియపై నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెస్సల్ కమిషన్ (NCDRC) స్టే విధించింది. రాజస్థాన్‌లోని కోట జిల్లా వినియోగదారుల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్‌పై జాతీయ కమిషన్ ఈ తాత్కాలిక స్టే ఉత్తర్వులు జారీ చేసింది.

కేసు వివరాలు ఇవే..

సల్మాన్ ఖాన్, ఇతరులు నటించిన ఓ పాన్ మసాలా ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందంటూ ఇంద్ర మోహన్ సింగ్ (Indramohan Singh) అనే వ్యక్తి కోట జిల్లా వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా సల్మాన్ ఖాన్‌తో సహా ఇతర పక్షాల సంతకాలను ధృవీకరించాలని జిల్లా ఫోరమ్ ఆదేశించింది. అయితే, ఈ ఫిర్యాదుకు అసలు చట్టబద్ధమైన అర్హత ఉందా అనే అంశాన్ని తేల్చకుండానే, నేరుగా సంతకాల విచారణకు ఆదేశించడంపై సల్మాన్ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ NCDRCని ఆశ్రయించారు. ఈ మేరకు NCDRC ప్రెసిడెంట్ జస్టిస్ ఏపీ సాహి, సభ్యుడు భరత్ కుమార్ పాండ్యాలతో కూడిన బెంచ్ ఈ కేసును విచారించింది. జిల్లా ఫోరమ్ ఈ కేసును నడిపించిన తీరు, దాని అధికార పరిధిపై బెంచ్ పలు కీలక ప్రశ్నలను లేవనెత్తింది. ఇదే వ్యవహారంలో గతంలో రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన కొన్ని తాత్కాలిక ఉత్తర్వులను కూడా బెంచ్ పరిగణనలోకి తీసుకుంది. వినియోగదారుల కోర్టులను కొందరు కావాలనే ఇబ్బంది పెట్టే సాధనాలుగా వాడుకుంటున్నారనే అప్పీలేట్ల వాదనలను విన్న కమిషన్, తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు కోట జిల్లా ఫోరమ్‌లో సల్మాన్ ఖాన్‌పై ఎలాంటి విచారణ జరపకూడదని స్పష్టం చేస్తూ స్టే ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను జూన్ 22కు వాయిదా వేస్తూ పిటిషనర్‌కు నోటీసులు జారీ చేసింది.

Next Story