‘నువ్వు నాకు నచ్చావ్’ క్రెడిట్ ఆయనదే..

by Sujitha Rachapalli |

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ

‘నువ్వు నాకు నచ్చావ్’ క్రెడిట్ ఆయనదే..
X

దిశ, సినిమా : విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.

స్రవంతి రవికిషోర్ : ‘నువ్వు నాకు నచ్చావ్’ రీ రిలీజ్ సందర్భంగా ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకి సంబంధించిన గొప్ప జ్ఞాపకాలను, ఆ అద్భుతమైన ప్రయాణాన్ని తలచుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది.

త్రివిక్రమ్: నాకు కూడా.

స్రవంతి రవికిషోర్: ఈ ఫిల్మ్‌ షూటింగ్ సెట్స్‌కి నువ్వు ఎక్కువగా వచ్చేవాడివి కదా?

త్రివిక్రమ్ : ‘నువ్వే కావాలి’, ‘చిరునవ్వుతో’ ఒకేసారి రాశాను. అందుకే ఆ సెట్స్‌కి ఎక్కువగా వెళ్ళాలేదు. ‘నువ్వే కావాలి’లో షుక్రియా పాట షూటింగ్, క్లైమాక్స్ చిత్రీకరణ టైంకి వచ్చాను. ‘నువ్వు నాకు నచ్చావ్’ కి మాత్రం ఎక్కువ శాతం షూటింగులకు వచ్చాను. న్యూజిలాండ్ కూడా వెళ్లాం కదా . డబ్బింగ్ టైంలో కూడా ఉన్నాను.

స్రవంతి రవి కిషోర్ : నెక్ట్స్ ‘నువ్వే నువ్వే’ సినిమాని నువ్వే డైరెక్ట్ చేయాలి కదా?

త్రివిక్రమ్ : అవును.. అందుకే నువ్వు నాకు నచ్చావ్ కి నేను అన్నింట్లో ఉన్నాను.

స్రవంతి రవి కిషోర్ : అప్పట్లో స్క్రిప్ట్ వెర్షన్ రాసి, డైలాగ్ వెర్షన్ దర్శకుడు, నిర్మాతలకు వినిపించేవారు. రాసింది చదవడం మాత్రమే కాదు.. నువ్వు చూసింది మేం చూసేవాళ్లం.

త్రివిక్రమ్ : నేను రాసే రూం కాకుండా పక్కన ఇంకో రూం ఉండేది. అందరం అందులోనే కూర్చుండేవాళ్లం.

స్రవంతి రవి కిషోర్ : ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్‌ని తప్ప ఇంకెవ్వరినీ ఊహించుకోలేకపోయాం. నువ్వు డిక్షన్‌తో సహా డైలాగ్స్ చెప్పినప్పుడే ప్రకాష్ రాజ్ అని ఫిక్స్ అయిపోయాం. సినిమాలోని సీన్లలో ఆయన్ను కాకుండా ఇంకెవ్వరినీ ఊహించుకోలేకపోయాం

త్రివిక్రమ్ : అవును. ఆ 22 సీన్లు.. నాకు గుర్తుంది. నానక్ రాం గూడలో ఇంటి సెట్ వేశారు. ఫస్ట్ రోజు ప్రకాష్ రాజ్ సెట్‌కి వచ్చారు. ఆ 22 సీన్లను నెరేట్ చేస్తుంటే.. ఆయనకు అప్పుడు తెలుగు రాదు. కన్నడలోనే మొత్తం సీన్లు, డైలాగ్స్ రాసుకున్నారు.

సుహాసిని గారు వస్తుంటే.. మీరు ఆ డైలాగ్ చెప్పారు (నవ్వుతూ). మంచి వాడా? చెడ్డ వాడా? అని అంటే.. మీరేమో మణిరత్నం అని అన్నారు (పగలబడి నవ్వుతూ). నేను రాసిందేమో ‘మంచివాడా? చెడ్డవాడా? మొగుడంతే’ అని ఉంటుంది. కానీ దానికి మీరు మాత్రం ‘మంచి వాడా? చెడ్డ వాడా? మణిరత్నం’ అన్నారు (నవ్వుతూ). నాకు గట్టిగా నవ్వు వస్తే.. బయటకు వెళ్లి నవ్వేశాను.

స్రవంతి రవి కిషోర్ : ఇదొక అద్భుతమైన ప్రయాణం. శాస్త్రి గారి గురించి చెప్పాలంటే.. ఎంత చెప్పినా తక్కువే

త్రివిక్రమ్ : నాకు బాగా గుర్తుంది ఏంటంటే.. నాకు మీరు మద్రాస్ నుంచి ఫోన్ చేశారు.. ‘ఓ నవ్వు చాలు’ అనే పాట గురించి చెప్పారు. పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా? ఆ కురులు చూపిస్తా కాదనక చస్తారా...

స్రవంతి రవి కిషోర్ : ఆయన అన్నింటికీ అలానే రాస్తారు. ఈ పాటను ఊటీలో షూట్ చేయాలి. అప్పుడే న్యూజిల్యాండ్ నుంచి వచ్చాం. వర్క్ అంతా నాన్ స్టాప్‌గా చేస్తున్నాం. అవతల కోటి స్టూడియోకి శంకర్ మహదేవన్ వచ్చి ఉన్నారు. నేనేమో ఇటు ఒత్తిడి చేయలేను. మనకు కావాల్సింది పాట కాదు.. మంచి పాట. ఏం చేయాలి? ఈ పాట ఆపేయాల్సి వస్తుందా? అని రకరకాలుగా అనుకున్నాను. అరేయ్.. ఆగురా.. పాట వచ్చింది అని కార్లో బయల్దేరాం. కారులోనే పల్లవి రాసుకుంటూ వచ్చాం. అందుకే ఆయన ఫైల్స్ లో పల్లవి అంతా కనిపించదు..

త్రివిక్రమ్ : ఆ..ఆ.. అవును.. ఆ కురులు చీకట్లో చిక్కుకుని అని ఉంది.. దాన్ని తరువాత కంప్లీట్ చేశారు.. ఆ కురులు చూపిస్తా కాదనక చస్తారా అని..

స్రవంతి రవి కిషోర్ : బెస్ట్ పార్ట్ ఏంటంటే?.. ఆయన రాసే ప్రతీ లైన్‌ను మనం ఫాలో అయ్యేవాళ్లం. ఏదో ఒక లైన్‌ను తీసుకుని వచ్చి పాట ఇదీ అనే వారు కాదు..

త్రివిక్రమ్ : ఒక్క లైన్ రాసినా ఎగ్జైట్ అయ్యేవాళ్లం.. ఒక్క రోజుకి ఒక్క లైన్ (నవ్వుతూ)..

స్రవంతి రవికిషోర్ : తను చాలా రకరకాలుగా రాసి అక్కడ పెట్టేవాళ్లు.. ఇటివ్వు అని.. వాలు జడ బాగుంది కదా? దీనితో ఎందుకు రాదు?..

గాలిపటం గగనానిదా? బాగుంది కదా? పాట అయిపోయింది కదా?.. అనేవాళ్లం. ముందు చరణం కంప్లీట్ చేశారు.. ఆ తరువాత పల్లవి పూర్తి చేశారు.

త్రివిక్రమ్ : చాలా నోస్టాల్జిక్‌గా ఉంది…ఇలా వెనక్కి వెళ్తుంటే.

స్రవంతి రవికిషోర్ : ఈ పేపర్స్ యోగేశ్వర్ శర్మ తీసుకుని వచ్చి ఇస్తే.. శాస్త్రి గారు చేత్తో పట్టుకున్న కాగితాలు కదా? అని ఎంతో ఎమోషనల్ అయ్యాను.. చాలా తొందరపడ్డాడు..

త్రివిక్రమ్ : పాటలు లేటుగా ఇచ్చారు కానీ.. మనిషి ఎర్లీగా ఎళ్లిపోయారు.

స్రవంతి రవికిషోర్ : ఈ చిత్రం ఇంత బాగా రావడానికి వెంకటేష్ కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది. ఆర్టిస్టుగా ఎంతో అద్భుతంగా చేశారు.

త్రివిక్రమ్ : మొత్తం డైలాగ్ వెర్షన్ అయిన తరువాత రెండు మూడుసార్లు రీడింగ్ తీసుకున్నారు. అంతలా ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. అంతలా లోపలకు ఇంజెక్ట్ చేసుకుని చేశారు.

స్రవంతి రవికిషోర్ : నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆఖరి రోజున ట్రైన్ ట్రావెల్ సీన్ చేశాం. హైదరాబాద్ నుంచి నల్గొండ వరకు బయల్దేరి తిరిగి రావాలి

త్రివిక్రమ్ : అంటే ఫస్ట్ సీన్‌ను లాస్ట్ తీశారా?

స్రవంతి రవికిషోర్ : హా.. అవును.. ఈ రోజే ఆఖరి రోజు కదా? గుమ్మడి కాయ కొట్టేస్తున్నాం. అప్పుడే అయిపోయిందా? కిషోర్.. అని అన్నారు. మేం 85 రోజుల్లో షూట్ చేశాం. మొత్తం మూడు గంటల 14 నిమిషాల నిడివి వచ్చింది.

త్రివిక్రమ్ : ఫైనల్‌గా మూడు గంటలకు తీసుకు వచ్చారా? (నవ్వుతూ)

స్రవంతి రవికిషోర్ : మూడు గంటల తొమ్మిది నిమిషాలతో రిలీజ్ చేశాం.

త్రివిక్రమ్ : అంటే యూట్యూబ్‌లో కూడా అంతే ఉందా?

స్రవంతి రవికిషోర్ : మూడు గంటల నాలుగు నిమిషాలు ఉంటుంది. సెన్సార్‌, అవన్నీ ఉన్నాయని అనుకుంటా.

స్రవంతి రవికిషోర్ : సినిమా రిలీజ్ అయినప్పుడు సుహాసిని సీన్లు ఎంత కాంట్రవర్సీ అయ్యాయ్.

త్రివిక్రమ్ : మీరొక్కరే భయపడలేదు. నేను అయితే ఆ సీన్లను కట్ చేసేద్దామని అన్నాను. ఏం కాదు ఏం కాదు.. ఈ వారం రోజులు వదిలేయ్ చెప్తాను అన్నారు (నవ్వుతూ). అప్పుడు ల్యాండ్ లైన్స్ కదా.. రాత్రి పదకొండు, పదకొండున్నరకు ఫోన్లు చేసి ప్రతీ డైలాగ్ గురించి ఫోన్ చేసి బాగుందని ఫీల్ అయి చెప్పేవారు.

స్రవంతి రవికిషోర్ : నువ్వు కూడా మంచి డైలాగ్ రాస్తే అలానే చెప్పేవాడివి. గుండెలో మాట కళ్లలో చూడాలి.. అమ్మ ఆవకాయ్ అంజలి.. ఇలా మంచి డైలాగ్స్ అన్నీ కూడా ఫోన్ చేసి చెప్పేవాడివి.

Next Story