శోకసంద్రంలో నెటిజన్లు.. సోషల్ మీడియా స్టార్ ‘కుర్చీ తాత’ హఠాన్మరణం

by Kema Shiva Kumar |

‘కుర్చీ మడతపెట్టి’ డైలాగ్‌తో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన ‘కుర్చీ తాత’ అలియాస్ మహ్మద్ పాషా ఆకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయారు.

శోకసంద్రంలో నెటిజన్లు.. సోషల్ మీడియా స్టార్ ‘కుర్చీ తాత’ హఠాన్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారి, తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడైన ‘కుర్చీ తాత’ అలియాస్ మహ్మద్ పాషా (66) ఇవాళ హఠాన్మరణం చెందారు. హైదరాబాద్‌లోని కృష్ణకాంత్ పార్కులో ఉదయం వాకింగ్ చేస్తుండగా ఆయనకు ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు (Heart Attack) రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ఆయన మరణవార్త తెలిసి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, సినీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క డైలాగ్‌తో ఓవర్‌నైట్ స్టార్..

యూట్యూబ్ ఇంటర్వ్యూలలో మహ్మద్ పాషా సరదాగా చెప్పిన ‘కుర్చీ మడతపెట్టి..’ అనే మాస్ డైలాగ్ సోషల్ మీడియాను ఊపేసింది. రికార్డు స్థాయిలో మీమ్స్, రీల్స్‌తో ఈ డైలాగ్ వైరల్ అయ్యింది. దీని క్రేజ్‌ను గమనించిన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమాలో ఈ డైలాగ్‌ను ఒక పాటగా (Kurchi Madathapetti Song) మార్చారు.

వెండితెరపై మహేష్ బాబుతో స్టెప్పులు..

గుంటూరు కారం సినిమాలో ఈ మాస్ మసాలా సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కేవలం పాటలోనే కాకుండా, స్వయంగా మహ్మద్ పాషా ఆ పాటలో మహేష్ బాబు, శ్రీలీలలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని డాన్స్ కూడా చేశారు. ఆ సినిమా తర్వాత ఆయనకు ఇండస్ట్రీలో మరికొన్ని అవకాశాలు, ఇంటర్వ్యూలు రావడంతో బిజీగా మారారు. అంతవరకు సాదాసీదా జీవితం గడిపిన ఆయన, కుర్చీ తాతగా మారి అందరినీ నవ్వించారు. అలాంటి వ్యక్తి వాకింగ్ చేస్తూ ఇలా హఠాత్తుగా కన్నుమూయడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Next Story