సినిమాల్లోకి వస్తానంటే నా ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు.. ఆ సమయంలో చాలా బాధపడ్డా: భాగ్యశ్రీ బోర్సే

by Mallepaka Hamsa |   (  Updated:2026-07-28 05:40:42  IST  )

తన నాన్నకు ఫోన్ చేయగా, అమ్మ వద్దని చెప్పిన పనిని నువ్వు ఎలా చేస్తావంటూ ఆయన గద్దించి వెంటనే ఫోన్ కట్ చేశారని వెల్లడించారు.

సినిమాల్లోకి వస్తానంటే నా ఫ్యామిలీ  సపోర్ట్ చేయలేదు.. ఆ సమయంలో చాలా బాధపడ్డా: భాగ్యశ్రీ బోర్సే
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఇటీవల ‘లెనిన్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో టాలీవుడ్‌లో ఆమె క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. విజయాన్ని సాధించిన జోరులోనే ఇండస్ట్రీలో అదే ఊపును కొనసాగిస్తూ వరుస ఆఫర్లతో ప్రస్తుతం ఆమె ఫుల్ బిజీ అయిపోయారు. అయినప్పటికీ నిత్యం పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన భాగ్యశ్రీ, తను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి ముందు కుటుంబంలో ఎలాంటి తీవ్రమైన పరిస్థితులు ఎదురయ్యాయో గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. తాను మోడలింగ్, సినిమాల్లోకి వెళ్తానని మొదట తన తల్లికి ఫోన్ చేసి చెప్పినప్పుడు, ఆమె ఎలాంటి ఆలోచన లేకుండా వెంటనే వద్దని ఖరాఖండిగా చెప్పినట్లు తెలిపారు. ఆ తర్వాత ధైర్యం చేసి తన నాన్నకు ఫోన్ చేయగా, అమ్మ వద్దని చెప్పిన పనిని నువ్వు ఎలా చేస్తావంటూ ఆయన గద్దించి వెంటనే ఫోన్ కట్ చేశారని వెల్లడించారు.

ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో, కనీసం తన అక్క అయినా తన ఇష్టాన్ని అర్థం చేసుకుని ఒప్పుకుంటుందనే నమ్మకంతో ఆమెకు కాల్ చేసినప్పటికీ అక్కడి నుంచి కూడా నిరాశే ఎదురైందని చెప్పారు. అయినప్పటికీ తనకు నటన, సినీ ఇండస్ట్రీపై ఉన్న అపారమైన మక్కువతో ఎవరి మాట వినకుండా ధైర్యంతో ఆడిషన్లు ఇచ్చానని భాగ్యశ్రీ తెలిపారు. దానివల్ల ఒక్కసారిగా తమ ఇంట్లో వాతావరణం మరియు పరిస్థితులు మారిపోయాయని అన్నారు. తాను చెప్పినా వినకుండా సినిమాల కోసం ఆడిషన్లకు వెళ్లడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లి, తనను వెంటనే వాట్సాప్‌లో బ్లాక్ చేయడమే కాకుండా దాదాపు ఆరు నెలల పాటు తనతో మాట్లాడలేదని చెప్పారు. ఆ సమయంలో తాను తీవ్రంగా మానసిక బాధ అనుభవించానని భాగ్యశ్రీ వెల్లడించారు. అయితే ఆ తర్వాత తాను సినిమాల్లో సాధించిన విజయాన్ని, పడిన కష్టాన్ని ప్రత్యక్షంగా చూశాక తన తల్లికి, కుటుంబ సభ్యులందరికీ తనపై పూర్తి నమ్మకం ఏర్పడిందని సంతోషం వ్యక్తం చేశారు.

Next Story