MS Raju: ‘దేవి’ కథను మొదట చిరంజీవి గారికే చెప్పాను.. ఆయన ఇచ్చిన సలహా అదే

by Pulgam srinivas |

‘దేవి’ కథ మొత్తం విన్న తర్వాత చిరంజీవి, బడ్జెట్ విషయంలో తనకు సలహాలు ఇచ్చినట్లు ఎం.ఎస్. రాజు చెప్పుకొచ్చారు.

MS Raju: ‘దేవి’ కథను మొదట చిరంజీవి గారికే చెప్పాను.. ఆయన ఇచ్చిన సలహా అదే
X

దిశ, వెబ్ డెస్క్: కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సోషియో ఫాంటసీ చిత్రం ‘దేవి’. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎస్. రాజు నిర్మించిన ఈ సినిమాలో ప్రేమ, సిజు, భానుచందర్, వనిత ప్రధాన పాత్రలు పోషించారు. 1999లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్ర నిర్మాత ఎం.ఎస్. రాజు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ... ‘దేవి’ సినిమా కథను మొదటగా చిరంజీవి గారికి వినిపించానని తెలిపారు.

ఆ సమయంలో ఆయన చాలా కాలంగా సినిమాలు లేకుండా ఖాళీగా ఉన్నారు. ఒక రోజు అనుకోకుండా నేను ఓ హోటల్‌కు వెళ్లాను. అదే సమయంలో అక్కడ చిరంజీవి గారు కనిపించారు. బహుశా ఆయన బయట ఎక్కడి నుంచో హోటల్‌కు వచ్చినట్లు అనిపించింది. కొంత సమయం తర్వాత ఆయన భార్య, పిల్లలు కూడా అక్కడికి వచ్చారు. ఆ గ్యాప్‌లో ఆయన ఒంటరిగా ఉండటంతో, ‘అన్నయ్య ఏం చేస్తున్నారు?’ అని అడిగాను. దానికి ఆయన, ‘ఏం లేదు రాజు... దాదాపు సంవత్సరం నుంచి ఖాళీగానే ఉన్నాను’ అని చెప్పారు. వెంటనే ‘ఒక కథతో సినిమా చేయాలనుకుంటున్నాను.

కాస్త వింటారా?’ అని అడిగాను. ఆయన కూడా ‘చెప్పండి... విందాం’ అన్నారు. ఆ తర్వాత నేను ‘దేవి’ కథ మొత్తం వివరించాను. ముఖ్యంగా సినిమాలో ఉండే గ్రాఫిక్స్ సన్నివేశాల గురించి చెబుతుంటే చిరంజీవి గారు ఆసక్తిగా విన్నారు. కథ పూర్తయ్యాక ఆయన, ‘చాలా డేరింగ్ నిర్ణయం తీసుకున్నావు. ఇలాంటి కథతో సినిమా అంటే బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది. కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్లు’ అంటూ సలహా ఇచ్చారని” ఎం.ఎస్. రాజు వెల్లడించారు. ఇలా ‘దేవి’ కథ విన్న తర్వాత చిరంజీవి బడ్జెట్ విషయంలో తనకు సూచనలు చేసినట్లు ఎం.ఎస్. రాజు చెప్పుకొచ్చారు.

Next Story