- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అస్సాం చిన్నారి నోట ‘వచ్చిందమ్మా’ సాంగ్.. మురిసిపోయిన మంత్రి నారా లోకేశ్! (వీడియో)
కళకు, సంగీతానికి భాషా భేదాలు లేవని, అవి దేశాన్ని ఏకతాటిపైకి తెస్తాయని మరోసారి నిరూపితమైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: కళకు, సంగీతానికి భాషా భేదాలు లేవని, అవి దేశాన్ని ఏకతాటిపైకి తెస్తాయని మరోసారి నిరూపితమైంది. తాజాగా అస్సాంకు చెందిన ఓ చిన్నారి తెలుగులో ఎంతో చక్కగా పాట పాడుతున్న వీడియో ఒకటి నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ క్యూట్ వీడియోపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తన అధికార సోషల్ మీడియా ఖాతా వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘గీత గోవిందం’. అందులోని సూపర్ హిట్ సాంగ్ ‘వచ్చిందమ్మా..’ను ఆ అస్సాం చిన్నారి తన ముద్దులొలికే గొంతుతో ఎంతో స్పష్టంగా పాడింది. తెలుగు భాష రాకపోయినా, ఆ పాటలోని భావాన్ని అర్థం చేసుకున్నట్లుగా ఎంతో ఆనందంగా పాడుతున్న ఆ చిన్నారి తీరు నెటిజన్ల మనసు దోచుకుంటోంది.
మంత్రి నారా లోకేశ్ ఫిదా..
ఈ వీడియోను చూసి ఫిదా అయిన మంత్రి నారా లోకేశ్, చిన్నారిని ప్రశంసిస్తూ తన అధికారిక ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. భారతదేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తుచేస్తూ ఆయన భావోద్వేగంగా స్పందించారు. ‘గీత గోవిందం సినిమాలోని ‘వచ్చిందమ్మా’ పాటను అస్సాంకు చెందిన ఓ చిన్నారి ఇంత ఆనందంగా పాడటమే భారతదేశ నిజమైన స్ఫూర్తికి నిదర్శనం. భాషలు వేరు, సంస్కృతులు వేరు.. కానీ మనందరి గుండె చప్పుడు ఒక్కటే. రాజకీయాల కంటే సంగీతం, సంస్కృతులే మన దేశాన్ని మరింత లోతుగా ఏకం చేస్తాయని ఇలాంటి క్షణాలు మనకు గుర్తు చేస్తాయి’ అని లోకేశ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. చిన్నారి ప్రతిభను, దేశ ఐక్యతను చాటుతూ మంత్రి లోకేశ్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు విశేషంగా ప్రశంసిస్తున్నారు.






