మెగాస్టార్ చిరంజీవి జోక్యం.. టాలీవుడ్‌లో ముగిసిన పర్సంటేజీ వివాదం

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-27 13:07:05  IST  )

టాలీవుడ్‌లో థియేటర్ల పర్సంటేజీ వివాదానికి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది.

మెగాస్టార్ చిరంజీవి జోక్యం.. టాలీవుడ్‌లో ముగిసిన పర్సంటేజీ వివాదం
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా థియేటర్ల యాజమాన్యాలు, నిర్మాతల మధ్య నడుస్తున్న పర్సంటేజీ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) రంగంలోకి దిగి నచ్చజెప్పడంతో ఎగ్జిబిటర్లు వెనక్కి తగ్గారు. ఇవాళ తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిని కలిసి తమ సమస్యలను వివరించారు. జూన్ 30 తర్వాత విడుదలయ్యే అన్ని సినిమాలను కేవలం పర్సంటేజీ పద్ధతిలోనే ప్రదర్శించాలని తాము భావిస్తున్నట్లుగా ఆయనకు తెలిపారు. అయితే, దీనిపై స్పందించిన చిరంజీవి పరిశ్రమ హితవు కోరి ప్రస్తుతం ఫిలిం చాంబర్ కమిటీ (Film Chamber Committee) ఇచ్చిన నివేదిక, మార్గదర్శకాల ప్రకారమే నడుచుకోవాలని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌కు తెలిపారు.

పాత రెంటల్ విధానంలోనే సినిమాల ప్రదర్శన..

చిరంజీవి ఇచ్చిన సలహాతో ఏకీభవించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. తాజాగా విడుదల కాబోయే రాంచరణ్ నటించిన ‘పెద్ది’ మూవీ ప్రదర్శనను యథావిధిగా పాత పద్ధతి అయిన రెంటల్ విధానంలోనే (Rental System) కొనసాగించేందుకు అంగీకరించారు. అదే సమయంలో, ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా పెద్ద సినిమాకు ప్రభుత్వం టికెట్ ధరలు పెంచితే.. ఆ పెంచిన మొత్తంలో 7.5 శాతం వాటాను ఎగ్జిబిటర్లకు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. ఇక మెగాస్టార్ మరోసారి పెద్దన్న పాత్ర పోషించి ఈ వివాదాన్ని పరిష్కరించడం పట్ల అటు నిర్మాతలు, ఇటు ఎగ్జిబిటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story