'మదరాసి' బడ్జెట్ వివాదం.. మురుగదాస్‌పై నిర్మాత ఫిర్యాదు

by Pulgam srinivas |

ఏఆర్ మురుగదాస్ 'మదరాసి' బడ్జెట్ వివాదం.. 10 కోట్ల పరిహారం లేదా 'రమణ 2' కథ ఇవ్వాలి.

మదరాసి బడ్జెట్ వివాదం.. మురుగదాస్‌పై నిర్మాత ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు తమిళ సినీ పరిశ్రమలో తిరుగులేని దర్శకుడిగా కొనసాగిన ఏఆర్ మురుగదాస్ ప్రస్తుతం మాత్రం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. కొంతకాలం క్రితం ఈయన శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మదరాసి చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక తాజాగా ఈ చిత్ర నిర్మాత, దర్శకుడు ఏఆర్ మురుగదాస్ పై దర్శకులు & నిర్మాతల కౌన్సిల్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రారంభంలో మదరాసి చిత్రాన్ని 115 కోట్ల రూపాయల బడ్జెట్‌లో పూర్తి చేస్తానని మురుగదాస్ హామీ ఇచ్చినప్పటికీ, చివరకు సినిమా ఖర్చు 170 కోట్లకు పెరిగిందని నిర్మాత ఆరోపించినట్లు తెలుస్తోంది.

బడ్జెట్ పెరగడానికి ప్రధాన కారణం సరైన ప్రణాళిక లేకపోవడం, అలాగే ఈ సినిమా పనులతో పాటు సికిందర్ సినిమా పనులను కూడా ఒకేసారి చేయడమేనని నిర్మాత పేర్కొన్నట్లు సమాచారం. ఈ కారణంగా మురుగదాస్ నుండి 10 కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలని నిర్మాత డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చలు జరిగిన అనంతరం, తాజాగా కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ నిర్ణయం ప్రకారం ఏఆర్ మురుగదాస్, తన రమణ 2 కథను ఆ నిర్మాణ సంస్థకు ఉచితంగా ఇవ్వాలని సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా లేదా అనే విషయంపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. ఇకపోతే ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ పతాకంపై ఎన్. శ్రీలక్ష్మీ ప్రసాద్ నిర్మించారు.

Next Story