Kangana: వారి వల్ల దర్శకులు బలవుతున్నారు.. బాలీవుడ్ హీరోల తీరు బయటపెట్టిన కంగనా

by Pulgam srinivas |

భారతీయ సినీ పరిశ్రమలో దర్శకులు, ఇతర టెక్నీషియన్లకు దక్కాల్సిన గౌరవం మరియు గుర్తింపు పూర్తిస్థాయిలో లభించడం లేదని కంగనా వ్యాఖ్యానించింది.

Kangana: వారి వల్ల దర్శకులు బలవుతున్నారు.. బాలీవుడ్ హీరోల తీరు బయటపెట్టిన కంగనా
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ నటి మరియు ప్రముఖ రాజకీయ నాయకురాలు అయిన కంగనా రనౌత్ తన మనసులో అనిపించిన విషయాలను ఎవరికి భయపడకుండా నిక్కచ్చిగా చెబుతూ ఉంటుంది. దాంతో పలు సందర్భాల్లో ఈమె మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా కంగనా సోషల్ మీడియా వేదికగా భారీ విజయం వైపు దూసుకుపోతున్న 'ధురంధర్ 2' చిత్రం గురించి ఓ పోస్ట్ చేసింది. అందులో భాగంగా ఈమె బాలీవుడ్ స్టార్ హీరోల వల్ల దర్శకులు ఎలా బలవుతున్నారు అనే విషయాన్ని చెప్పుకొచ్చింది.

హాలీవుడ్‌లో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ, అక్కడ వారి కంటే స్టార్ దర్శకులకే ఎక్కువ విలువ ఇస్తారని కంగనా పేర్కొంది. కానీ మన హిందీ సినీ పరిశ్రమలో మాత్రం అలాంటి సంస్కృతి లేదని ఆమె అభిప్రాయపడింది. ముఖ్యంగా భారతీయ సినీ పరిశ్రమలో దర్శకులకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని తెలిపింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో దర్శకులు మరియు ఇతర సాంకేతిక నిపుణులు ఎంతో ఒత్తిడికి గురవుతూ అనేక గంటలు పనిచేస్తారని, కానీ వారికి ఇచ్చే పారితోషకం మాత్రం చాలా తక్కువగా ఉంటుందని ఆమె చెప్పింది.

వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదని కూడా పేర్కొంది. దాంతో కొత్తగా సినిమా ఇండస్ట్రీలోకి రావాలని అనుకునే యువత నటులు కావాలని ఎక్కువగా ఆశపడుతున్నారని, కానీ దర్శకులుగా లేదా ఇతర సాంకేతిక విభాగాల్లో పని చేయాలని అనుకునే వారి సంఖ్య తగ్గిపోతుందని కంగనా అభిప్రాయపడింది. 'ధురంధర్ 2' దర్శకుడు ఆదిత్య ధర్ ఈ మూవీతో స్టార్ దర్శకుడిగా మారారని, స్టార్ హీరోల కంటే ఎక్కువగా ఆయన మెరుస్తున్నారని కంగనా పేర్కొంది. ఇతనిని చూసి మరెంతోమంది దర్శకులు కావాలని ఆశిస్తున్నానని తెలిపింది. అయితే ఈ పోస్ట్ మొత్తంలో 'ధురంధర్ 2' హీరో అయిన రణ్‌వీర్ సింగ్ పేరు ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హంగా మారింది.

Next Story