ఉప్పెన కోసం నా దగ్గరికి వచ్చి బుచ్చి వెళ్ళిపోయాడు.. షాకింగ్ నిజాలు చెప్పిన జగపతిబాబు

by Pulgam srinivas |

‘ఉప్పెన’ సినిమాలో విజయ్ సేతుపతి చేసిన పాత్రకు మొదట తననే ఎంపిక చేయాలని బుచ్చిబాబు భావించినట్లు జగపతిబాబు వెల్లడించాడు.

ఉప్పెన కోసం నా దగ్గరికి వచ్చి బుచ్చి వెళ్ళిపోయాడు.. షాకింగ్ నిజాలు చెప్పిన జగపతిబాబు
X

దిశ, వెబ్ డెస్క్: జగపతిబాబు తాజాగా రామ్ చరణ్ హీరోగా రూపొందిన ‘పెద్ది’ చిత్రంలో అప్పల సూరి పాత్రలో నటించాడు. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాల్లో జగపతిబాబుకు సంబంధించిన లుక్ చాలా కొత్తగా ఉండటంతో, ఆయన పాత్రపై ప్రేక్షకులు భారీ ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈయన కూడా ఈ సినిమాలో తన పాత్ర అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ‘లెజెండ్’ తర్వాత నుంచి తాను చేసిన పాత్రల్లో తనకు ఐదారు పాత్రలు మాత్రమే బాగా నచ్చాయని, అందులో ఈ పాత్ర మొదటి స్థానంలో ఉంటుందని వెల్లడించాడు. దీంతో ఈ సినిమాపై, అలాగే ఆయన పాత్రపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘ఉప్పెన’కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని జగపతిబాబు బయటపెట్టాడు. జగపతిబాబు మాట్లాడుతూ… ‘పెద్ది’ చిత్రంలో మాత్రమే కాకుండా, ‘ఉప్పెన’ సినిమాలో కూడా నన్ను తీసుకోవాలని బుచ్చి అనుకున్నాడు. అందులో భాగంగా నా అపాయింట్‌మెంట్ తీసుకుని ఒక రోజు నా దగ్గరకు వచ్చాడు. వచ్చాక ‘ఏంటి చెప్పు’ అన్నాను. దాంతో ఆయన ఇంటి దగ్గర పని ఉంది సార్ వెళ్తాను’ అన్నాడు. ఓకే… నాకు అర్థమైంది, ఈయన మనకంటే మంచి ఆప్షన్ వెతుకుతున్నాడని.

ఇక దాన్ని అప్పుడు వదిలేశా. కొంతకాలం క్రితం ‘నువ్వు ఆ రోజు మా ఇంటికి వచ్చి ఎందుకు వెళ్లావు? నిజం చెప్పు’ అని అడిగాను. దాంతో ఆయన ‘మిమ్మల్ని మొదట ‘ఉప్పెన’ చిత్రంలో విజయ్ సేతుపతి చేసిన పాత్ర కోసం అనుకున్నాను. కానీ మార్కెట్ కారణాల వల్ల మీకంటే మంచి ఆప్షన్ అని అటు వెళ్లాను’ అని చెప్పారు. దాంతో ‘నిజం చెప్పావు, బాగుంది’ అని నేను ఆయనతో అన్నాను” అని చెప్పుకొచ్చాడు. ఇక ఇదే ఇంటర్వ్యూలో ‘పెద్ది’ సినిమాలో తనను ఈ పాత్రకు ఎంపిక చేసినందుకు బుచ్చిబాబుకు జగపతిబాబు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలిపాడు.

Next Story