Jagapathi Babu: విలన్ అంటే లావుగా, అసహ్యంగా ఉండాలని ఆ నిర్మాత అన్నాడు

by Pulgam srinivas |

హీరోగా కెరీర్ ముగిసిందని భావించిన సమయంలో సీరియల్స్ చేయాలనే ఆలోచన కూడా వచ్చిందని జగపతిబాబు వెల్లడించారు.

Jagapathi Babu: విలన్ అంటే లావుగా, అసహ్యంగా ఉండాలని ఆ నిర్మాత అన్నాడు
X

దిశ, వెబ్ డెస్క్: జగపతి బాబు తాజాగా తాను హీరో నుంచి విలన్‌గా మారే సమయంలో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జగపతిబాబు మాట్లాడుతూ, “ఒక దశలో హీరోగా నా కెరీర్‌ను కొనసాగించడం కష్టంగా అనిపించింది. ఆ సమయంలో కొంతమంది నిర్మాతలు నాతో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చినా, నేను వర్కౌట్ కాదని వారికి ముందే చెప్పేవాడిని. నిజానికి అప్పట్లో నా దగ్గర డబ్బులు కూడా లేవు. అయినప్పటికీ వాళ్లకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో హీరోగా సినిమా చేయనని చెప్పాను” అని అన్నారు. అలాగే, “ప్రవరాఖ్యుడు సినిమా సమయంలో కూడా ఇదే విషయం చెప్పాను. కానీ ఆ సినిమా చేయాల్సి వచ్చింది.

హీరోగా నా కెరీర్ ముగిసిందనుకున్న సమయంలో తర్వాత ఏం చేయాలనే ఆలోచన వచ్చింది. సీరియల్స్ చేస్తే రోజుకు రూ.5,000 వస్తాయనే ఆలోచన కూడా వచ్చింది. అదే సమయంలో విలన్ పాత్రలు చేస్తే బాగుంటుందని భావించాను. ఈ విషయంపై ఒకరోజు సురేష్ బాబు గారిని కలిసి మాట్లాడాను. అయితే ఆయన ‘విలన్ అంటే లావుగా, అసహ్యంగా ఉండాలి’ అని చెప్పారు. అలాంటి సమయంలోనే నాకు లెజెండ్ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత నా కెరీర్ మంచి దిశలో ముందుకు సాగింది” అని తెలిపారు. ఇక ప్రస్తుతం జగపతిబాబు, రామ్ చరణ్ హీరోగా రూపొందిన పెద్ది చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది.

Next Story