శంకర్‌కు కొత్త చిక్కు తెచ్చి పెట్టిన ఇండియన్ 3

by Pulgam srinivas |

లైకా సంస్థ వారు శంకర్ 'ఇండియన్ 3' పూర్తి అయ్యాకే వేరే సినిమా చేయాలని, లేకుంటే లీగల్‌గా వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

శంకర్‌కు కొత్త చిక్కు తెచ్చి పెట్టిన ఇండియన్ 3
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ సినీ పరిశ్రమలోనే గొప్ప గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో శంకర్ ఒకరు. జెంటిల్‌మెన్ చిత్రంతో మొదలైన ఈయన ప్రస్థానం రోబో వరకు అద్భుతంగా సాగింది. ఆ తర్వాత ఈ దర్శకుడికి మెల్లమెల్లగా కష్టాలు మొదలయ్యాయి. రోబో చిత్రం తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఏ చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకోలేదు. అయినా కూడా ఈ దర్శకుడిని నమ్మి వందల కోట్లు పెట్టిన నిర్మాతలు ఉన్నారు. శంకర్‌కు ఫుల్ క్రేజ్ తెచ్చిపెట్టిన చిత్రాలలో ఇండియన్ మొదటి స్థానంలో ఉంటుంది.

ఈ సినిమాని తెలుగులో భారతీయుడు పేరుతో విడుదల చేశారు. కమల్ హాసన్ ఇందులో హీరోగా నటించారు. ఇందులోని కమల్ నటనకు, శంకర్ దర్శకత్వ ప్రతిభకు జనాలు ఫిదా అయ్యారు. ఈ సినిమా విడుదల అయిన చాలా సంవత్సరాలకి 'ఇండియన్ 2'ని స్టార్ట్ చేశారు. లైకా సంస్థ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను తీసుకుంది. ఈ చిత్ర షూటింగ్ స్టార్ట్ అయిన కొన్ని రోజుల నుండి శంకర్, లైకా మధ్య విభేదాలు రావడం మొదలయ్యాయి. దాంతో ఈ దర్శకుడు 'ఇండియన్ 2'ను పక్కన పెట్టేసి రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ స్టార్ట్ చేశాడు.

దాంతో లైకా వారు కోర్టు వరకు వెళ్లారు. ఆ తర్వాత గొడవ సర్దుమనిగింది, శంకర్ ఏకకాలంలో 'ఇండియన్ 2', 'గేమ్ చేంజర్' షూటింగ్లను పూర్తి చేశాడు. ఇండియన్ 2 చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే విడుదల అయిన మొదటి భాగం భారీ డిజాస్టర్ కావడంతో ఇండియన్ 3 ఊసే లేకుండా పోయింది. కానీ లైకా సంస్థ వారు మాత్రం శంకర్ 'ఇండియన్ 3'ని పూర్తి చేశాకే వేరే సినిమా చేయాలి అని, లేనట్లయితే లీగల్ గా వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే శంకర్ కెరీర్ మరింత కష్టాల్లో పడే అవకాశం ఉంది అని కోలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Next Story