"ప్రపంచమంతా ఒకే దేశమైతే.." ఆర్జీవీ సంచలన ట్వీట్

by Malleboina Mahesh |   (  Updated:2026-06-28 07:26:27  IST  )

ప్రపంచమంతా ఒకే దేశమైతే యుద్ధాలుండవు, వీసాలుండవు.. ఏఐ ద్వారానే 'వన్ వరల్డ్' సాధ్యమంటూ ఆర్జీవీ సంచలన ట్వీట్!

ప్రపంచమంతా ఒకే దేశమైతే.. ఆర్జీవీ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ దర్శకుడు, నిత్య వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రామ్ గోపాల్ వర్మ ఎక్స్(Twitter)లో సంచలన ట్వీట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా మరోసారి తనదైన శైలిలో చేసిన వినూత్న పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది. ఆర్జీవీ తన ట్వీట్‌లో "ఈ ప్రపంచమంతా కేవలం ఒకే ఒక్క దేశంగా మారితే ఎలా ఉంటుంది?" అనే అంతర్జాతీయ భావనను ఆయన పంచుకున్నారు. ప్రస్తుతం ఏ దేశం ఎలాంటి కృత్రిమ మేధస్సు (AI)ని అభివృద్ధి చేస్తోందో తెలియని భయాందోళనల తరుణంలో.. ఈ 'వన్ వరల్డ్, వన్ కంట్రీ' (ఒకే ప్రపంచం, ఒకే దేశం) ఆలోచనే అంతిమ పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు.

ఆర్జీవీ తన ట్వీట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ప్రపంచమంతా ఒకే దేశంగా మారితే సరిహద్దులు, వీసాలు, పాస్‌పోర్ట్‌ల అవసరం ఉండదు. ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించవచ్చు, చదువుకోవచ్చు. దేశాల మధ్య యుద్ధాలు, రక్షణ బడ్జెట్ ఖర్చులు ముగిసిపోతాయి. ఒకే ఉమ్మడి కరెన్సీ వల్ల ప్రపంచ వ్యాపారం సులువవుతుంది. శాస్త్రవేత్తలు తమ రహస్యాలను దాచకుండా కలిసి పనిచేయడం వల్ల సరికొత్త ఆవిష్కరణలు వేగంగా వస్తాయి. పర్యావరణ మార్పులు, అంతరిక్ష పరిశోధనలు వంటి పెద్ద సమస్యలను స్వార్థ రాజకీయాలు లేకుండా ఒకే గ్రహంగా ఎదుర్కోవచ్చు. అయితే ఈ విధానాన్ని కేవలం రాజకీయ నాయకులు మాత్రమే అసహ్యించుకుంటారు. ఎందుకంటే సరిహద్దులు ఉంటేనే వారు ప్రజలను భయపెట్టి, "మనం వర్సెస్ వాళ్ళు" అనే కార్డుతో పాలిస్తారు. ఒకే దేశం అయితే వారు కేవలం స్థానిక మేనేజర్లుగా మారిపోతారు. అప్పుడు వారు ప్రపంచవ్యాప్త లీడర్లతో మెరుగైన ఆలోచనలతో పోటీ పడాల్సి వస్తుంది. ఫలితంగా సామాన్యుడికి శాంతి, సమాన అవకాశాలు దక్కుతాయి.

ఇలాంటి జగత్తును నిర్మించడం కేవలం కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) వల్ల మాత్రమే సాధ్యమవుతుందని వర్మ నొక్కి చెప్పారు. ఏఐ అనువాద సాధనాలు ఇప్పటికే భాషా అడ్డంకులను తొలగించాయి. భవిష్యత్తులో ఇవి స్థానిక చట్టాలు, ఆచారాలను కూడా క్షణాల్లో విశ్లేషించగలవు. వీసాలు లేకుండా సురక్షితమైన గ్లోబల్ ఐడీలను, రాజకీయాల ప్రమేయం లేని స్థిరమైన ఏఐ కరెన్సీని ఇది నడపగలదు. ముంబై వీధి వ్యాపారి నుండి జర్మనీ ఫ్యాక్టరీ వరకు మధ్యవర్తులు, అవినీతి లేకుండా వ్యాపారం సాగుతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా పోటీ పడే నాయకుల హామీలను, అబద్ధాలను ఏఐ రియల్ టైమ్‌లో ఫ్యాక్ట్-చెక్ చేసి, ఓటర్లు ఫలితాలను బట్టి లీడర్లను అంచనా వేసేలా చేస్తుంది. మానవాళి హితం కోరే సరైన ఏఐ వ్యవస్థలను గనుక నిర్మిస్తే.. "వన్ వరల్డ్, వన్ కంట్రీ" అనేది త్వరలోనే నిజం అవుతుందని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు.

Next Story