తెలంగాణకు చేరిన బెజవాడ బ్రదర్స్ ఫైట్.. కేశినేని నానికి ఎంపీ చిన్ని కౌంటర్

by Prasad Jukanti |

హైదరాబాద్‌లో ఐటీ పార్క్ స్థలాన్ని కేశినేని చిన్ని బినామీ సంస్థ ఆక్రమిస్తోందని నాని ఫిర్యాదు చేయగా.. చిన్ని దానికి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణకు చేరిన బెజవాడ బ్రదర్స్ ఫైట్..  కేశినేని నానికి ఎంపీ చిన్ని కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బెజవాడ బ్రదర్స్ మాజీ ఎంపీ కేశినేని నాని వర్సెస్ ఎంపీ కేశినేని చిన్ని మధ్య విభేదాలు రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. నిన్నా మొన్నటి వరకు ఏపీ రాజకీయాలకే పరిమితం అయిన వీరి మధ్య పంచాయతీ తాజాగా తెలంగాణకు చేరింది. హైదరాబాద్ శివార్లలోని శంషీగూడలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఎంపీ చిన్ని కుటుంబానికి చెందిన బినామీ సంస్థ ఆక్రమిస్తోందంటూ ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ నాని ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. అయితే నాని చేసిన ఈ ఫిర్యాదుపై తాజాగా చిన్ని స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు.

ఇక మిగిలింది ట్రంప్, పుతిన్ మాత్రమే:

తాజాగా స్పందించిన చిన్ని.. 'ఈర్ష్య, ద్వేషం, కసి, పగతో నిత్యం రగిలిపోతున్న రెట్టల నాని..ఇంతకుమించి దిగజారవు అనుకున్న ప్రతిసారి ఇంకా ఇంకా దిగజారుతూనే ఉన్నావు అంటూ కౌంటర్ ఇచ్చారు. రేవులో తాడి చెట్టు మాదిరి పెరిగావు ఇంగిత జ్ఞానం మాత్రం లేదు. ప్రధానికి, రాష్ట్రపతికి ఇరువురు ముఖ్యమంత్రులకు ఫిర్యాదు చేశావ్.. ఇక మిగిలింది ట్రంప్, పుతిన్, కిమ్, KA పాల్ మాత్రమే. నీరెట్టలో 1 శాతం కూడా నిజం లేదు.. పక్కకెళ్లి ఆడుకోపో' అంటూ కౌంటర్ ఇచ్చారు.

ఐటీ పార్క్ స్థలం చుట్టూ వివాదం:

కాగా శంషీగూడలో టీజీఐఐసీ ఐటీ పార్క్ కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు కేశినేని నాకు కుటుంబానికి చెందిన బినామీ సంస్థ ప్రయత్నం చేస్తోందని నాని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రూపంలో ఫిర్యాదు చేశారు. ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడానికి కేశినేని చిన్ని, ఆయన బినామీ సంస్థలైన 'మెసర్స్ ఎక్సెల్లా' (M/s Exella) తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని నాని ఈ లేఖలో ఆరోపించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఇచ్చిన పాత ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి, నకిలీ లీగల్ సెటిల్‌మెంట్లతో నిందితులు ఏకంగా సుప్రీంకోర్టును సైతం తప్పుదోవ పట్టించారని నాని ధ్వజమెత్తారు.

Next Story