- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంగోంగ్ సరస్సులో 'ఆఫ్-రోడింగ్' విన్యాసాలు..రూ. 50 వేల జరిమానా విధించిన లడఖ్ ప్రభుత్వం!
లడఖ్ పంగోంగ్ సరస్సులోకి కార్లతో దూసుకెళ్లిన పర్యాటకులు.. ఒక్కో వాహనానికి రూ.50 వేల చొప్పున ఎల్జీ వీకే సక్సేనా భారీ జరిమానా!

దిశ, వెబ్ డెస్క్: గతకొద్ది రోజులుగా పవిత్రమైన ప్రాంతాల్లో పర్యాటకులు ఆగడాలు మితిమీరిపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లడఖ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అత్యంత సున్నితమైన పర్యావరణ వ్యవస్థ (Ecological System) కలిగిన లడఖ్ ప్రాంతంలో పర్యాటకుల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేసేందుకు అక్కడి అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిబంధనలను ఉల్లంఘిస్తూ పంగోంగ్ త్సో సరస్సు (Pangong Lake), నదీ ప్రవాహాలు, వన్యప్రాణి రక్షణ వలయాల్లోకి కార్లను పోనిస్తూ రీల్స్, విన్యాసాలు చేస్తున్న 'ఆఫ్-రోడింగ్' రాయుళ్లకు లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా (Lt. Governor VK Saxena) గట్టి షాక్ ఇచ్చారు. ఇలాంటి పర్యావరణ విధ్వంసక చర్యలపై తొలిసారిగా భారీ జరిమానాలు విధిస్తూ క్రిమినల్ ప్రాసిక్యూషన్‌ను ప్రారంభించారు.
లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటేరియట్ తెలిపిన వివరాల ప్రకారం.. లడఖ్‌లోని చాంగ్‌థాంగ్, నుబ్రా లోయ పరిధిలోని పంగోంగ్ సరస్సు, వన్యప్రాణుల రక్షిత ప్రాంతాల్లోకి తమ కార్లను అక్రమంగా తీసుకెళ్లినందుకు గాను వైల్డ్‌లైఫ్ డిపార్ట్‌మెంట్ (Wildlife Department) జూన్ 26న నాలుగు వాహనాలపై భారీ చర్యలు తీసుకుంది. వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను ఒక్కో వాహనదారుడికి రూ. 50,000 చొప్పున మొత్తం రూ. 2 లక్షల జరిమానా విధించింది. ఈ వివాదాస్పద వాహనాలు హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులవిగా గుర్తించారు. లడఖ్‌లోని సున్నితమైన వాతావరణాన్ని, అక్కడి అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణులను కాపాడటానికి లడఖ్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా కట్టుబడి ఉందని, ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని ఎల్జీ సెక్రటేరియట్ స్పష్టం చేసింది. ఇకపై లడఖ్ వచ్చే పర్యాటకులు స్థానిక నిబంధనలను గౌరవించాలని, లేనిపక్షంలో భారీ జరిమానాలతో పాటు చట్టపరమైన విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.






