నేను చేయకపోతే సినిమానే వదిలేస్తాను అన్నాడు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయశాంతి

by Pulgam srinivas |

విజయశాంతి తన సినీ ప్రయాణంలో దర్శకుడు టి. కృష్ణ కీలక పాత్ర పోషించారని, ‘నేటి భారతం’ సినిమాతో తనలోని నటనను గుర్తించిన వ్యక్తి ఆయనే అని తెలిపింది.

నేను చేయకపోతే సినిమానే వదిలేస్తాను అన్నాడు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయశాంతి
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు విజయశాంతి. ఈమె లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటే కేవలం ఇంటి పనులు చూసుకునే పాత్రలు చేయడం కాదు, స్టార్ హీరోలు చేసే స్థాయి పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. భారీ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం, పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి రౌడీలకు చెక్ పెట్టడం వంటి పవర్‌ఫుల్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఈమెకు స్టార్ హీరో స్థాయి ఇమేజ్ కూడా దక్కింది. ఇక సినిమాల్లో గ్లామర్ పాత్రలు చేయడం కంటే యాక్షన్ చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించడం చాలా కష్టమని, ముఖ్యంగా మహిళలకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయని విజయశాంతి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

అలాంటి సవాళ్లను అధిగమించి యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం అంత సులభమైన విషయం కాదని, ఆ సమయంలో ఎంతో శారీరక, మానసిక ఒత్తిడి ఉంటుందని వెల్లడించింది. ఇక కొంతకాలం క్రితం విజయశాంతి తన సినీ ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన దర్శకుడు టి. కృష్ణ (హీరో గోపీచంద్ తండ్రి) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన సినీ ప్రయాణంలో టి.కృష్ణ పాత్ర ఎంతో కీలకమని ఆమె తెలిపింది. “మొదటిసారి నాలోని నటన ప్రతిభను గుర్తించింది ఆయనే. తన ‘నేటి భారతం’ చిత్రంలో నాకు గొప్ప పాత్ర ఇచ్చారు. ఆ సినిమా ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చింది. అప్పటివరకు కేవలం గ్లామర్ పాత్రలకు పరిమితమైన నన్ను ఓ నటిగా గుర్తించింది టి.కృష్ణ గారే.

ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని విజయశాంతి చెప్పుకొచ్చింది. అలాగే ‘ప్రతిఘటన’ సినిమా విషయంలో కూడా ముందుగా తననే సంప్రదించారని తెలిపింది. అయితే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో తాను చేయలేనని చెప్పగా, “ఈ కథను తీస్తే నీతోనే తీస్తాను, లేకపోతే పక్కన పెట్టేస్తాను. కానీ వేరే వాళ్లతో చేయను” అని టి.కృష్ణ చెప్పినట్లు విజయశాంతి వెల్లడించింది. చివరకు ఎంతో కష్టపడి నిర్మాతలను ఒప్పించి ఆ సినిమా చేశానని, అది తనకు మంచి పేరు తీసుకువచ్చిందని చెప్పింది. ఇలా తన సినీ ప్రస్థానంలో టి.కృష్ణ గారు ఎంతో కీలక పాత్ర పోషించినట్లు విజయశాంతి గుర్తుచేసుకుంది.

Next Story