ఇకపై ఇతరుల కోసం సినిమాలు చేయను.. నాకు సంతృప్తినిచ్చే పాత్రలే చేస్తా: సోనాక్షి సిన్హా

by Mallepaka Hamsa |

గతంలో ఇతరులను సంతోష పెట్టడం కోసమో లేదా రకరకాల కారణాల వల్లో కొన్ని సినిమాలు చేయాల్సి వచ్చిందని, కానీ ఇప్పుడు మాత్రం కేవలం తన సంతోషం కోసమే నటిస్తున్నానని స్పష్టం చేశారు.

ఇకపై ఇతరుల కోసం సినిమాలు చేయను.. నాకు సంతృప్తినిచ్చే పాత్రలే చేస్తా: సోనాక్షి సిన్హా
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఇటీవల వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నారు. పెళ్లైన తర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతుందనుకుంటే.. మరింత జోష్‌తో లేడీ ఒరియెంటెడ్ కథలను ఎంచుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వంలో వచ్చిన ‘సిస్టమ్’ వెబ్ సిరీస్‌లో లాయర్ పాత్రలో కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ మంచి విజయాన్ని సాధిస్తూ.. ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటోంది. ఈనేపథ్యంలో.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాక్షి తన కెరీర్, ప్రాధాన్యతల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇటీవలి కాలంలో బలమైన మహిళా పాత్రలను ఎంచుకోవడంపై సోనాక్షి స్పందిస్తూ.. ఇది నూటికి నూరు శాతం తాను కావాలనే చేస్తున్న మార్పు అని చెప్పారు. ప్రస్తుతం ఒక నటిగా తనకు ఏది సంతోషాన్ని, తృప్తిని ఇస్తుందో ఆ ప్రాజెక్టులనే ఎంచుకుంటున్నట్లు తెలిపారు. తన కెరీర్ ప్రయాణం అద్భుతంగా సాగిందని, దేనికీ తాను బాధపడటం లేదని పేర్కొన్నారు.

గతంలో ఇతరులను సంతోష పెట్టడం కోసమో లేదా రకరకాల కారణాల వల్లో కొన్ని సినిమాలు చేయాల్సి వచ్చిందని, కానీ ఇప్పుడు మాత్రం కేవలం తన సంతోషం కోసమే నటిస్తున్నానని స్పష్టం చేశారు. ఒకవేళ తనకు నచ్చిన పాత్రలు రాకపోతే, తనకంటూ ఉన్న చిన్న ప్రపంచంలో ఎంతో సంతోషంగా జీవిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. అలాగే ‘సిస్టమ్’ సిరీస్ విజయంపై స్పందిస్తూ.. దర్శకురాలు అశ్విని తనను "ఇండియాకు మేరిల్ స్ట్రీప్, కేట్ విన్స్‌లెట్ లాంటిది" అని పొగడటంపై సోనాక్షి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కామెంట్ వినగానే తాను అశ్వినికి ఫోన్ చేసి, తనపై చాలా ప్రెజర్ పెట్టేసావని అన్నట్లు గుర్తుచేసుకున్నారు. తాను ఎవరిలానో ఉండటానికి ప్రయత్నించకపోయినా.. తాను ఎంతగానో ఆరాధించే హాలీవుడ్ నటీమణులతో తనను పోల్చడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు.

Next Story