రాఖీ కడితే వదిలేస్తాడనుకున్నాను కానీ అలా చేయలేదు.. లవ్ స్టోరీ రివీల్ చేసిన అంజలి

by Mallepaka Hamsa |

తాను స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక అబ్బాయి తనను అమితంగా ఇష్టపడేవాడని చెప్పారు.

రాఖీ కడితే వదిలేస్తాడనుకున్నాను కానీ అలా చేయలేదు.. లవ్ స్టోరీ రివీల్ చేసిన అంజలి
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ అంజలి, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం అంజలి, కోలీవుడ్ స్టార్ విశాల్ సరసన ‘మకుటం’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా విశాల్ స్వయం దర్శకత్వంలో రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తుండగా.. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఈ నెలలోనే థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు టాక్. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంజలి తన వ్యక్తిగత జీవితానికిసంబంధించిన ఓ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వ్యక్తిగత జీవితం, స్కూల్ రోజులకు సంబంధించిన ఒక సరదా అనుభవాన్ని పంచుకున్నారు. తాను స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక అబ్బాయి తనను అమితంగా ఇష్టపడేవాడని చెప్పారు. ఏడో తరగతి నుండి పదో తరగతి వరకు ఆ అబ్బాయి నిరంతరం తనకే ప్రపోజ్ చేస్తూ ఉండేవాడని అన్నారు. మొదట్లో తాను ఆ అబ్బాయిని అస్సలు పట్టించుకోలేదని, కానీ అతని పట్టుదల చూసి పదో తరగతిలో ఒక గట్టి నిర్ణయం తీసుకున్నానని అంజలి నవ్వుతూ చెప్పారు.

అది చెప్పడానికి వెళ్లిన సమయంలోనే.. అతను ఓ చాలెంజ్ చేయడంతో.. ఇక లాభం లేదనుకుని అతనికి నేరుగా రాఖీ కట్టేశానని వెల్లడించారు. రాఖీ కడితే ఇక తనను వదిలేస్తాడని తాను అనుకున్నట్లు చెప్పారు. కానీ ఆ అబ్బాయి మాత్రం చాలా తెలివిగా.. "నువ్వు రాఖీ కట్టినంత మాత్రాన నేను నీకు అన్నయ్యను అయిపోను.. నీ కన్నయ్యను" అంటూ ఆ రాఖీని తీసి పక్కన పడేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడని గుర్తు చేసుకున్నారు. అయితే, ఆ సంఘటన తర్వాత అతన్ని తాను మళ్లీ ఎప్పుడూ చూడలేదని అంజలి వివరించారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎవరైనా మీకు ప్రపోజ్ చేశారా? అని యాంకర్ ప్రశ్నించగా.. దీనికి అంజలి స్పందిస్తూ.. "మీరు ఈ మధ్యకాలం గురించి అడుగుతున్నారా? లేక ఫ్లాష్‌బ్యాక్ గురించా? ముందు ఆ క్లారిటీ ఇవ్వండి" అంటూ తెలివిగా తప్పించుకున్నారు. అంతేకాకుండా.. తనదైన శైలిలో తెలివైన సమాధానం కూడా ఇచ్చారు. మీ మనసులో ఎవరి పేరు ఉందో నాకు తెలియదు.. నేను ఒకరి పేరు చెబితే మీరు ఇంకొకరి పేరు చెప్పి నన్ను ఇబ్బంది పెడతారు. ఒకవేళ నేను అవును అని చెబితే, మీ లిస్టులో ఆ పేరు ఉందా అని నన్నే అడుగుతారు. అందుకే నేను ఎలాంటి పేర్లు చెప్పను అని ముగించారు. అయితే ప్రస్తుతం మాత్రం తన జీవితంలో అలాంటి ప్రత్యేకమైన వ్యక్తి ఎవరూ లేరని, తాను సింగిల్‌గానే ఉన్నానని అంజలి స్పష్టం చేశారు.

Next Story