‘ఎల్ఐకే’ బాక్సాఫీసు ఫలితాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా.. విఘ్నేష్ శివన్ ఎమోషనల్ నోట్

by Mallepaka Hamsa |

ఆన్‌లైన్‌లో విపరీతంగా జరిగిన నెగెటివ్ ప్రచారం వల్లే థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యామని చాలా మంది తనకు మెసేజ్‌లు చేస్తున్నారని ఆయన వెల్లడించారు.

‘ఎల్ఐకే’ బాక్సాఫీసు ఫలితాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా.. విఘ్నేష్ శివన్ ఎమోషనల్ నోట్
X

దిశ, సినిమా: ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి కాంబోలో వచ్చిన ‘ఎల్ఐకే’ మూవీ భారీ అంచనాల మధ్య వచ్చి ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ నిరాశపరిచిందని చెప్పాలి. కలెక్షన్ల పరంగా కూడా నిర్మాతలకు నష్టాలను మిగిలిచింది. తాజాగా, ఈ విషయంపై విఘ్నేష్ శివన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఈ సినిమా పరాజయాన్ని తాను ఇప్పటికీ పూర్తిగా జీర్ణించుకోలేకపోతున్నానని, ఆ బాధ నుండి బయటకు రాలేకపోతున్నానని ఆయన పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో విపరీతంగా జరిగిన నెగెటివ్ ప్రచారం వల్లే థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యామని చాలా మంది తనకు మెసేజ్‌లు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో పెద్దగా ప్రభావం చూపించే వ్యక్తుల మద్దతు లేని సినిమాల విషయానికొస్తే, ఆన్‌లైన్ అభిప్రాయాలే వాటి తలరాతను పూర్తిగా మార్చేస్తాయని విఘ్నేష్ శివన్ అభిప్రాయపడ్డారు.

కేవలం మూవీని విమర్శించడమే కాకుండా, కావాలనే ఉద్దేశపూర్వకంగా రాసే నెగెటివ్ రివ్యూలు ప్రేక్షకులను గందరగోళానికి గురిచేస్తూ దర్శకుల కలలను పూర్తిగా ముక్కలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కొన్ని సినిమాలు నెగెటివ్ రివ్యూలు వచ్చినా తట్టుకుని నిలబడతాయని, కానీ కొన్ని చిత్రాలు నిలబడలేకపోతున్నాయని ఆయన ఆవేదన చెందారు. ఎంతో కష్టపడి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఇంకా మంచి ఆదరణ దక్కాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, విడుదలైన మొదట్లో ఆదరణ దక్కకపోయినా, ఆ తర్వాత కాలంలో అద్భుతమైన చిత్రాలుగా నిలిచిన సినిమాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయని విఘ్నేష్ శివన్ గుర్తుచేశారు. తన ‘ఎల్ఐకే’ సినిమా కూడా భవిష్యత్తులో కచ్చితంగా అలానే మంచి గుర్తింపు తెచ్చుకుంటుందనే ఆశతో తాను ఉన్నట్లు ఆయన ఎమోషనల్‌గా వివరించారు.

Next Story