నా నటనను గుర్తుంచుకునేలా ఉండే కథలకే ప్రాధాన్యం ఇస్తా.. నాగదుర్గ ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |

ఫోక్ సాంగ్స్ మాత్రమే తన అసలైన గుర్తింపు అని నాగదుర్గ స్పష్టం చేశారు.

నా నటనను గుర్తుంచుకునేలా ఉండే కథలకే ప్రాధాన్యం ఇస్తా.. నాగదుర్గ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: తన అద్భుతమైన ఎనర్జిటిక్ మాస్ స్టెప్పులతో యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కొత్త ఊపు తీసుకొచ్చిన ఫేమస్ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన నాగదుర్గ.. వెండితెరపై కనిపించేందుకు సిద్ధమయ్యారు. బలగం ఫేమ్ ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ఇడుపు కాయితం సినిమాతొ హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. శ్రీలత అనే తెలంగాణ గ్రామీణ యువతి పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే తమిళంలో ‘లవ్ ఓ లవ్’ చిత్రంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. వరుసగా సినిమా అవకాశాలు వస్తుండటంతో, నాగదుర్గ ఇకపై ఫోక్ సాంగ్స్‌కు పూర్తిగా దూరం కాబోతున్నారని, కేవలం చిత్రాలపైనే దృష్టి పెట్టబోతున్నారనే పుకార్లు సోషల్ మీడియాలో జోరుగా షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఫోక్ సాంగ్స్ మాత్రమే తన అసలైన గుర్తింపు అని నాగదుర్గ స్పష్టం చేశారు.

ఫోక్ సాంగ్స్ వల్లే తనకు ఈ రోజు ఇంతటి ఆదరణ, గుర్తింపు లభించాయని చెప్పారు. ఇక పాటలకు దూరం కావడం అనే వార్తలపై మాట్లాడుతూ.. తాను ఏదో ప్రమోషన్ల కోసం ఫోక్ సాంగ్స్ చేయడం లేదని అన్నారు. తాను ఇండస్ట్రీకి వచ్చిన దారి అదేనని, ఈ స్థాయికి తీసుకొచ్చిన జానపద వేదికను తాను జీవితంలో మర్చిపోలేనని ఎమోషనల్ అయ్యారు. అందుకే హీరోయిన్ అయినప్పటికీ, భవిష్యత్తులో అవకాశం దొరికినప్పుడల్లా మంచి ఫోక్ సాంగ్స్ చేస్తూనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. అలాగే సినిమాల్లో తన పాత్రల ఎంపిక గురించి కూడా నాగదుర్గ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూవీస్‌లో కేవలం పాటల కోసం మాత్రమే తనను హీరోయిన్‌గా పెట్టి, డ్యాన్స్ చేయించి పంపించేసే గ్లామర్ పాత్రలు తాను చేయనని, అలాంటివి తనకు అస్సలు నచ్చవని తేల్చి చెప్పారు. కథలో హీరోయిన్ పాత్రకు బలమైన ప్రాధాన్యత ఉండాలని, ఒక నటిగా తనలోని నటనను, ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉన్న పాత్రలనే ఎంచుకుంటానని అన్నారు. థియేటర్ల నుంచి బయటకు వచ్చాక కూడా ప్రేక్షకులు తన నటనను గుర్తుంచుకునేలా ఉండే కథలకే తాను మొదటి ప్రాధాన్యత ఇస్తానని నాగదుర్గ స్పష్టం చేశారు.

Next Story